గ్రూపు1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయం : హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాకు హైకోర్టు నో చెప్పింది. ప్రిలిమ్స్‌వాయిదాకు ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని ప్రకటించింది. ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలంటూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన బి.వెంకటేశ్‌ సహా పలు జిల్లాలకు చెందిన మరో 35 మంది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ పి. కార్తీక్‌ విచారణ జరిపారు. పరీక్షల మధ్య 2 నెలల గడువు ఉండాలన్న పిటిషనర్ల వాదనను టీఎస్‌పీఎస్‌సీ తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వ్యతిరేకించారు. సుమారు 3 నెలల గడువు ఉందనీ, పరీక్షల తేదీకి, ప్రిలిమ్స్‌కు మధ్య గడువు ఉందని చెప్పారు. దీంతో మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిట్‌, టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌, సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను జూన్‌ 20కి వాయిదా వేసింది.
ఎన్‌టీఆర్‌ విగ్రహ ప్రతిష్టపై స్టే
ఖమ్మం పట్టణం లకారం చెరువులో కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు హైకోర్టు నిరాకరిస్తూ స్టే విధించింది. గతంలోని స్టే ఉత్తర్వులను పొడిగించిందది. విగ్రహంలో పిల్లనగ్రోవి, ఫించం వంటివి తొలగించామనీ, ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. ఆ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 6కు వాయిదా వేసింది.
ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ఏర్పాట్లు జరిగాయి. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ ఏర్పాటు చేయడాన్ని భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్‌ యాక్షన్‌ కమిటి హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారించారు.
హిందువుల మనోభావాల్ని దెబ్బతియడమే కాకుండా చెరువులో విగ్రహ ఏర్పాటు మున్సిపల్‌, వాల్టా చట్టాలకు కూడా విరుద్ధమని పిటిషనర్ల వాదన. రాజకీయ నేత విగ్రహాన్ని దేవుడి రూపంలో పెట్టడం తప్పన్నారు. పిల్లనగ్రోవి, నెమిలి పింఛం తొలగింపు జరిగిందని, విగ్రహఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అదనపు ఏజీ రామచందర్‌రావు వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు, విగ్రహ ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలిచ్చారు.

Spread the love