నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈనెల 19న గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022, ఏప్రిల్ 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన సంగతి విదితమే. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని ఆ ప్రకటనలో తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల 14వ తేదీ వరకు తుది గడువున్నది. పాత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేననీ, అయితే ఫీజు మాత్రం మినహాయింపునిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ గతంలోనే స్పష్టం చేసింది. యూనిఫామ్ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్), ఆర్డీవో పోస్టులకు కనిష్ట, గరిష్ట వయోపరిమితి 21 నుంచి 35 ఏండ్లు ఉంటాయనీ, మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 ఏండ్ల వరకు ఉంటాయని వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేండ్లపాటు సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భూగర్భ జలశాఖలో పోస్టుల ఫలితాలు విడుదల
భూగర్భ జల శాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది జులై 18,19, 20, 31 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్‌ఎస్)ను విడుదల చేశామని పేర్కొన్నారు. ఆ వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు. ప్రస్తుతం ఉన్న కమిషన్ నిబంధనల ప్రకారం మెరిట్ ఆధారంగా జీఆర్‌ఎస్‌ను రూపొందించామని తెలిపారు. ధ్రువపత్రాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. తిరస్కరించిన, చెల్లని దరఖాస్తుదారుల అభ్యర్థులను జీఆర్‌ఎల్‌లో ప్రకటించలేదని వివరించారు.