ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

నవతెలంగాణ – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ పరీక్షల తీరును ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ జరుగలేదు. చిత్తూరు జిల్లాలో ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నాం. నకిలీ హాల్‌ టికెట్‌ తయారుచేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్‌ లేదా జులైలలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష ఉంటుందని, పరీక్షల వాయిదా వదంతులు నమ్మకుండా అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు.ఆదివారం ఉదయం 10.30కు ప్రారంభైన పరీక్షలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. 24,142 మంది ఇన్విజిలేటర్లు, 850 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. కేంద్రాల వద్ద 3,971 మంది పోలీసులను, ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాల తరలింపు కోసం అదనంగా మరో 900 మంది పోలీసులను నియమించారు.

Spread the love