గ్రూప్‌-2 వాయిదాకే మొగ్గు?

Is group-2 in favor of postponement?– త్వరలోనే ప్రకటించే అవకాశం
– డిసెంబర్‌లో నిర్వహించాలంటూ అభ్యర్థుల ఆందోళన
– టీజీపీఎస్సీతో సర్కారు సంప్రదింపులు
– చైర్మెన్‌ మహేందర్‌రెడ్డితో కోదండరామ్‌, హరగోపాల్‌ భేటీ
– నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి
– 18 నుంచి డీఎస్సీ పరీక్షలు యధాతథం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపుపైనా చర్చించాం. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులను పెంచటం కూడా నోటిఫికేషన్‌ను ఉల్లంఘించినట్టే అవుతుంది. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్రూప్‌-1కు కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచటం సాధ్యమైంది. గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదు.’అని సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. ‘గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండటంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఈనెల 18 నుంచి వచ్చేనెల ఐదు వరకు డీఎస్సీ పరీక్షలున్నాయి. ఆ వెంటనే వచ్చేనెల ఏడు, ఎనిమిది తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలున్నాయి. దీంతో సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.’అని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. ‘డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం’అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అన్నారు.
డీఎస్సీ రాతపరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్నాయి. వచ్చేనెల ఐదో తేదీ వరకు జరుగుతాయి. గ్రూప్‌-2 రాతపరీక్షలు వచ్చేనెల ఏడు, ఎనిమిది తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రెండు పరీక్షలూ ఒకదాని తర్వాత మరొకటి వెంటవెంటనే ఉన్నాయి. ఆ రెండు పరీక్షలకూ సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమే లేదు. దీంతో డీఎస్సీ వాయిదా పడుతుందా?, గ్రూప్‌-2 వాయిదా పడుతుందా? అన్న ప్రశ్న అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈనెల 18 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు డీఎస్సీ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో యధాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈనెల 11 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ అభ్యర్థులకు సూచించింది. దీంతో డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని తేలిపోయింది. డీఎస్సీకి 2,79,966 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణపై స్పష్టత రావడంతో గ్రూప్‌-2 వాయిదా పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మెన్‌, కార్యదర్శితో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గ్రూప్‌-2 వాయిదా వేస్తే జరిగే పరిణామాలు, మళ్లీ రాతపరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశమున్నదీ, అభ్యర్థులకు మేలు జరుగుతుందా?, మరింత నష్టం కలుగుతుందా? అన్న విషయాలపై చర్చిస్తున్నారు. గ్రూప్‌-2 వాయిదా వేస్తున్నట్టు త్వరలోనే ప్రకటించే అవకాశమున్నది. ఇంకోవైపు గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేయాలనీ, పోస్టులను పెంచాలంటూ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాటపట్టారు. ఇటీవల టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అదేరోజు గ్రూప్స్‌ పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించడం గమనార్హం.
అభ్యర్థులకు న్యాయం చేయాలి : కోదండరామ్‌
పోటీ పరీక్షల అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హరగోపాల్‌తో కలిసి టీజీపీఎస్సీ చైర్మెన్‌ ఎం మహేందర్‌రెడ్డితో మంగళవారం సమావేశయ్యారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆందోళనల గురించి చైర్మెన్‌కు వివరించామని చెప్పారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. డీఎస్సీకి, గ్రూప్‌-2 రాతపరీక్షలకు మధ్య ఎక్కువ సమయం లేదని వివరించారు. సన్నద్ధమయ్యేందుకు సమయమివ్వాలనీ, గ్రూప్‌-2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు.

గ్రూప్‌-2 పోస్టుల పెంపుపై తర్జన భర్జన
రాష్ట్రంలో మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కి పెరిగాయి. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022, ఏప్రిల్‌ 26న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కు పెరగడంతో టీజీపీఎస్సీ ఫిబ్రవరి 19న మళ్లీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల 1:50 నిష్పత్తి చొప్పున గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. గ్రూప్‌-1 తరహాలోనే గ్రూప్‌-2 పోస్టుల సంఖ్యను పెంచి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రాతపరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలని కోరుతున్నారు. గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేసేందుకు సానుకూలంగా ఉన్న ప్రభుత్వం పోస్టుల పెంపుపై తర్జన భర్జన పడుతున్నది. అవసరమైతే గ్రూప్‌-2 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామంటూ గతంలోనే మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇంకోవైపు గ్రూప్‌-1 తరహాలో గ్రూప్‌-2,3 పోస్టులను పెంచే వెసులుబాటు లేదంటూ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లో గ్రూప్‌-2 పోస్టులను పెంచే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆగస్టు ఏడు, ఎనిమిది తేదీల్లో గ్రూప్‌-2 రాతపరీక్షలు జరుగుతాయి.
గ్రూప్‌-2 వాయిదా వేయాలి : డీవైఎఫ్‌ఐ
ఈనెల 18 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు డీఎస్సీ రాతపరీక్షలు జరుగుతాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌ చెప్పారు. గ్రూప్‌-2 రాతపరీక్షలు వచ్చేనెల ఏడు, ఎనిమిది తేదీల్లో జరుగుతాయని వివరించారు. ఆ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమెక్కడుందని ప్రశ్నించారు. గ్రూప్‌-2 వాయిదా వేయాలనీ, పోస్టుల సంఖ్యను పెంచాల ని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love