– రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీపీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ రాతపరీక్షలకు, గ్రూప్-2 రాతపరీక్షలకు మధ్య వ్యవధి ఒకే రోజు ఉండడంతో ఈనెల ఏడు, ఎనిమిది తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 రాతపరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 15న పేపర్-1, పేపర్-2, అదేనెల 16న పేపర్-3, పేపర్-4 రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. రోజూ రెండు విడతల్లో పరీక్షలుంటాయని తెలిపారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో విడత రాతపరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాతపరీక్షలను నిర్వహిస్తున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చేఏడాది మేలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అక్టోబర్‌లో రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
గ్రూప్-2 రాతపరీక్షల షెడ్యూల్
పేపర్, సబ్జెక్టు తేది
పేపర్-1 డిసెంబర్ 15
జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ (ఉదయం 10 నుంచి
మధ్యాహ్నం 12 వరకు)
పేపర్-2 డిసెంబర్ 15
హిస్టరీ, పాలిటీ, సొసైటీ (మధ్యాహ్నం 3 నుంచి
సాయంత్ర 5.30 వరకు)
పేపర్-3 డిసెంబర్ 16
ఎకానమి, డెవలప్‌మెంట్ (ఉదయం 10 నుంచి
మధ్యాహ్నం 12 వరకు)
పేపర్-4 డిసెంబర్ 16
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం (మధ్యాహ్నం 3 నుంచి
సాయంత్ర 5.30 వరకు)