– 1,401 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
– 5.36 లక్షల మంది దరఖాస్తు
– ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 వరకే అభ్యర్థులకు అనుమతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు చేపట్టింది. ఆదివారం రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం, సోమవారం ఒకే విడత ఉదయం మాత్రమే రాతపరీక్షలు జరుగుతాయి. గ్రూప్-3కి రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రూప్-3లో మొత్తం మూడు పేపర్లున్నాయి. ఆదివారం ఉదయం మొదటి విడతలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీఎస్ పేపర్, మధ్యాహ్నం రెండో విడతలో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. సోమవారం ఉదయం విడతలో ఎకానమీ, డెవలప్‌మెంట్ పేపర్‌కు పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మొదటి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఉదయం 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోరు. రెండో విడత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారికి అనుమతి ఉండబోదు. మొదటి రోజు తెచ్చిన హాల్‌టికెట్‌ను మరుసటి రోజు జరిగే పరీక్షకూ తేవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌లో ఉన్న నిబంధనలను పాటించాలని కోరారు. తెలంగాణ తొలి గ్రూప్-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబర్ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.