– రూ.176 లక్షల కోట్లకు చేరిన కేంద్ర రుణం
– గత జూన్‌తో పోలిస్తే 25 శాతం అధికం
– రాబడిలో 19 శాతం వడ్డీలకే సరి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రుణం కొండలా పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ.176 లక్షల కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే సమయంలో రూ.141 లక్షల కోట్లుగా ఉన్న రుణం ఏకంగా పాతిక శాతం పెరిగింది. ప్రతి త్రైమాసికంలోనూ రుణభారం 1.2 శాతం చొప్పున పెరుగుతూనే ఉంది. అయితే సంవత్సరం క్రితం నాటి త్రైమాసిక పెరుగుదల 4.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో విదేశీ రుణభారం రూ.9.78 లక్షల కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం జూన్ నాటికి విదేశీ రుణం రూ.8.50 లక్షల కోట్లుగా ఉంది. జూన్ నాటికి ఉన్న రూ.149 లక్షల కోట్ల అంతర్గత రుణాలలో ప్రభుత్వ బాండ్ల ద్వారా సేకరించినవి (మార్కెట్ రుణాలు) రూ.104.5 లక్షల కోట్లు. సెక్యూరిటీల (చిన్న మొత్తాలు) ద్వారా రూ.27 లక్షల కోట్లు, టీ-బిల్లుల ద్వారా రూ.10.5 లక్షల కోట్లు, బంగారం బాండ్ల ద్వారా రూ.78,500 కోట్లు రుణాలుగా పొందారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.1 లక్షల కోట్ల మేర రుణాలు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రూ.6.61 లక్షల కోట్ల రుణం తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.14.1 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ దీనిని తగ్గించుకునే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రారంభంలో ప్రభుత్వ వ్యయం పెరిగినప్పటికీ ఇంకా వేగం పుంజుకోలేదు. 2024-25లో ద్రవ్య లోటు లక్ష్యం 4.9 శాతంగా ఉన్నా అది తగ్గవచ్చునని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త గౌరసేన్ గుప్తా అంచనా వేశారు.
ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 19 శాతం రుణ బకాయిలపై వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.11.6 లక్షల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరపు జీడీపీ అంచనా రూ.326 లక్షల కోట్లలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 54 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రుణం, జీడీపీ నిష్పత్తి 57.5 శాతంగా ఉంది. 2020-21 నుండి ఈ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. 2020-21లో అది గరిష్టంగా 62.75 శాతానికి చేరింది.