ఏడు శాతం ఎగువన వృద్ధి

– ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా
– ద్రవ్యోల్బణం ఆధారంగానే వడ్టీ రేట్లు
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్థి రేటు 7 శాతం ఎగువన నమోదయ్యే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంచనా వేశారు. బుధవారం సీఐఐ కార్యక్రమంలో దాస్‌ మాట్లాడుతూ.. గడిచిన ఏడాదిలో అధిక వృద్ధి రేటు చోటు చేసుకోవచ్చన్నారు. చివరి త్రైమాసికంలో ఆశ్చర్యకరమైన గణంకాలు నమోదు కావొచ్చన్నారు. వ్యవసాయ రంగం అద్బుత ప్రగతిని కనబర్చిందని దాస్‌ పేర్కొన్నారు. మూలధనం, మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వం అధిక వ్యయం చేసిందని దాస్‌ పేర్కొన్నారు. ప్రయివేటు రంగంలోనూ పెట్టుబడులు పెరిగాయని.. అదే విధంగా స్టీల్‌, సిమెంట్‌ రంగాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిందన్నారు. తయారీ రంగం సామర్థ్య వినియోగంలో 75 శాతానికి చేరిందని ఇటీవల ఆర్‌బీఐ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5శాతం పెరగొచ్చని దాస్‌ అంచనా వేశారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.7 శాతానికి పరిమితం కావొచ్చన్నారు. 2016లో రోజుకు 2.28 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదు కాగా.. ప్రస్తుతం రోజుకు 37.75 కోట్ల లావాదేవీలు రుగుతున్నాయని తెలిపారు. 2022-23కు సంబంధించిన జీడీపీ గణంకాలను ఈ నెల చివరి రోజున సీఎస్‌ఓ వెల్లడించే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం ఆధారంగానే వడ్డీ రేట్లు నిర్ణయం అవుతాయని దాస్‌ పేర్కొన్నారు. చాలా మంది రేట్ల పెంపును నిలిపివేయాలని తమను కోరుతున్నారని.. కానీ అది తమ చేతుల్లో లేదన్నారు. అది పూర్తి క్షేత్ర స్థాయి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరపతి, ద్రవ్యోల్బణం ఇతర అంశాల ఆధారంగా రేట్ల నిర్ణయం జరుతుందన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరంగా, పటిష్టంగా ఉందన్నారు. రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందన్నారు.

Spread the love