జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్‌ను విజయవంతగా ప్రయోగించింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 27.30 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ కొనసాగిన అనంతరం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌ నింగిలోకి దూసుకెల్లింది. ఈ రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌-01 అనే నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2232 కిలోల బరువు ఉండే ఎన్‌వీఎస్‌-01 అనే నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని భూధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో రుబిడియం అణుగడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసింది. ఇటువంటి టెక్నాలజీ అతితక్కువ దేశాల వద్ద మాత్రమే ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్‌ క్లాక్‌ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. కచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా అందించలేవు. 2018లో కూడా ఇలా పనిచేయని ఉపగ్రహాన్ని మరో శాటిలైట్‌ పంపి భర్తీ చేశారు. ప్రస్తుతం నాలుగు ఐఆర్‌ఎన్‌ఎస్‌ ఉపగ్రహాలు మాత్రమే లొకేషన్‌ సర్వీసులను అందిస్తున్నాయి. దేశీయంగా అభివద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్‌ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు, సిగల్‌ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్‌ అమర్చే పరికరాల్లో, పర్సనల్‌ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది. ఈ ఏడాది ఇప్పటికే నెలకు ఒక రాకెట్‌ చొప్పున ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా నాలుగు రాకెట్లను ప్రయోగించగా అవన్నీ విభిన్న తరహా రాకెట్లు కావడం విశేషం.
త్వరలో మరో 4 నావిగేషన్‌ ఉపగ్రహాలు : ఇస్రో ఛైర్మన్‌
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట నుంచి సోమవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని 18 నిమిషాల 45 సెకండ్ల వ్యవధిలో నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చింది. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష కక్షలో ఉన్న ఐ.ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ ఉపగ్రహాలు కాలంచెల్లి పోతున్న నేపథ్యంలో మరో నాలుగు నావిగేషన్‌ ఉపగ్రహాలను 6 నెలలు, 6 నెలల వ్యవధిలో ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మిషన్‌ డైరెక్టర్‌ గిరి, స్పేస్‌ క్రాఫ్ట్‌ డైరెక్టర్‌ కెవిఎస్‌ భాస్కర్‌, శాక్‌ డైరెక్టర్‌ నీలేష్‌ ఎన్‌ దేశారు, యు ఆర్‌ఎస్‌సి డైరెక్టర్‌ శంకరన్‌, షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌ ఉన్నికష్ణన్‌ నాయర్‌, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్‌ నారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love