కరెంటుపై జీఎస్టీ

GST on electricity– వినియోగదారులపై పెనుభారం
– కేంద్రం ఆదేశాలతో డెలాయిట్‌ అధ్యయనం
–  ఎలక్ట్రిసిటీ డ్యూటీ స్థానంలో జీఎస్టీ విధించాలని సిఫార్సు
ప్రజల చేతిగోళ్లు ఊడగొట్టి పన్నులు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకాడట్లేదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆదాయవనరుగా మార్చుకొనేందుకు తహతహ లాడుతుంది. తాజాగా నిత్యవసర వస్తువుగా మారిన కరెంటును జీఎస్టీ పరిధిలోకి తెచ్చి, జనం జేబుల్ని మరింత లూటీ చేసేందుకు సిద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) స్థానంలో జీఎస్టీని ప్రవేశపెట్టి, దానిలో కేంద్రం వాటాను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. కేంద్రం ఆదేశాలతో దీనిపై అధ్యయనం చేసిన ‘డెలాయిట్‌ ఆడిట్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌’ సంస్థ జీఎస్టీ వసూలు చేస్తే ఆదాయం పెరుగుతుందనీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత ఉండకపో వచ్చని అంచనా వేసి, నివేదిక ఇచ్చింది. నేడో రేపో ఈ కరెంటు బాంబు విద్యుత్‌ వినియోగదారుల నెత్తిన పడటం ఖాయంగా కనిపిస్తుంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరెంటు స్విచ్‌ వేస్తే ‘జీఎస్టీ’ షాక్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పెరిగిన కరెంటు చార్జీలతో విద్యుత్‌ వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వారిపై మరింత ఆర్థిక భారాన్ని మోపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నది. దానికోసం ఓ ప్రయివేటు సంస్థతో అధ్యయనం చేయించింది. సదరు సంస్థ ఆ నివేదికను ఇటీవలే కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు అందచేసింది. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) లేదు. అయితే విద్యుత్‌ ఉపకరణాలు, బొగ్గు, గ్యాస్‌, సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తికి అవసరమైన వస్తువులపై జీఎస్టీ విధిస్తున్నారు. దాన్ని ఆయా విద్యుదుత్పత్తి సంస్థలు చెల్లిస్తున్నాయి. తాజాగా జీఎస్టీ పరిధిలోకి విద్యుత్‌ వినియోగదారుల్ని తెస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కేంద్రప్రభుత్వానికి వచ్చింది. నిత్యవసర వస్తువల్లో విద్యుత్‌ కూడా చేరడంతో పన్ను ఎందుకు వేయకూడదో అధ్యయనం చేసి చెప్పండంటూ ‘డెలాయిట్‌ ఆడిట్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌’ సంస్థను ఆదేశించింది. విద్యుత్‌ వినియోగదారులపై జీఎస్టీ విధిస్తే వచ్చే లాభనష్టాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ కోరింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ‘డెలాయిట్‌’ సంస్థ ఇటీవలే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దేశంలోని రాష్ట్రాలన్నీ వేర్వేరుగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) వసూలు చేస్తున్నాయనీ, ఇది కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నదని గుర్తించారు. ఈడీ స్థానంలో జీఎస్టీని తీసుకొస్తే, రాబడి అధికంగా ఉంటుందని నివేదికలో సిఫార్సు చేసినట్టు సమాచారం. కరెంటు వినియోగదారుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే దాని ప్రభావం ఆయా రాష్ట్రాల ఆదాయం పైనేగాక పరిశ్రమలు, గృహ వినియోగదారులపై ఎలా ఉంటుందనే విషయాలను కూడా ‘డెలాయిట్‌’ సంస్థ అధ్యయనం చేసింది.
పెట్రోల్‌, డీజిల్‌, సహజ వాయువు (గ్యాస్‌) వంటి అనేక వస్తువుల్లో విద్యుత్‌ ఒకటి. ఇప్పటివరకు ఇది జీఎస్టీ పరిధిలో లేదు. అయితే ఈ ప్రతిపాదనపై గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల విద్యుత్‌ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో చర్చించింది. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం స్వాగతించినట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ)ని యూనిట్‌కు ఆరు పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు వంద యూనిట్ల కరెంటు కాలితే, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ కాలమ్‌ సపరేట్‌గా ఉంటుంది. బిల్లు మొత్తంలో ఈ సొమ్ము కలిసే ఉంటుంది. స్వల్ప మొత్తమే కాబట్టి వినియోగదారులు దీనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడు కేంద్రం చూపు దీనిపైగా పడింది. ‘ఈడీ’ ద్వారా వసూలైన సొమ్ము నేరుగా రాష్ట్రాల ఖజానాకే వెళ్తుంది.
‘ఈడీ’ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండటం వల్ల పన్ను వసూళ్లలో హేతుబద్ధత లేకుండా పోతున్నదనీ, దాన్ని స్థిరీకరిస్తూ ‘జీఎస్టీ’ పరిధిలోకి తెస్తే, రాష్ట్రాల వాటా ఆదాయం కూడా పెరుగుతుందని ‘డెలాయిట్‌’ విశ్లేషించింది. అయితే ఈ ప్రభావం గృహ విద్యుత్‌ వినియోగదారులపై భారీగా పడుతుంది. దానితో పాటు పరిశ్రమలకూ కరెంటు జీఎస్టీ భారం అధికమైతే, వాటి ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. అంతిమంగా ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. కరెంటును జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఏఏ రాష్ట్రాలు ఎంత ఆదాయాన్ని కోల్పోతాయనే అంచనాను కూడా ‘డెలాయిట్‌’ మదింపు చేసింది. ఆ ఆదాయాలను భర్తీ చేసేలా జీఎస్టీ శ్లాబు రేటు నిర్ణయం జరగాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం దేశీయ పారిశ్రామిక రంగంపై ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. అయితే ఇప్పటికే విద్యుదుత్పత్తి ఉపకరణాలపై జీఎస్టీ విధిస్తున్నందున, తిరిగి కరెంటు వినియోగదారులపై కూడా జీఎస్టీ విధిస్తే, పన్నుపై పన్ను వేసినట్టు అవుతుందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కరెంటు బిల్లులు భారీగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సంస్కరణల వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని జీఎస్టీ ద్వారా భర్తీ చేయవచ్చని ‘డెలాయిట్‌’ ప్రతిపాదించిట్టు సమాచారం. అయితే రాష్ట్రాల మధ్య ‘ఈడీ’ పన్ను ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు ఉన్నదనీ, జీఎస్టీ పరిధిలోకి తెస్తే 0.5 శాతం నుంచి ఒక్క శాతానికి పరిమితం చేయవచ్చని ప్రతిపాదించారు. మరోవైపు ప్రస్తుతం విద్యుత్‌పై జీఎస్టీ లేనందున ఉత్పత్తిదారులు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లను ఉపయోగించుకోలేకపోతున్నారనీ, విద్యుత్‌పై జీఎస్టీ రేటును 5 శాతంగా నిర్ణయిస్తే, బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు లభిస్తుందని ‘డెలాయిట్‌’ విశ్లేషించింది. త్వరలోనే కేంద్రప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలను ఒప్పించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

Spread the love