కౌలు రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి

given to tenant farmers Guarantees should be implemented– సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌
– ఖమ్మంలో రాష్ట్ర సదస్సు.. ర్యాలీ
నవతెలంగాణ-తల్లాడ
కౌలు రైతులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ అన్నారు. తల్లాడలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదినేని రమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సదస్సులో పోతినేని ప్రసంగించారు. ప్రతి అరగంటకూ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 67 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 60శాతం మంది కౌలు రైతులేనని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కౌలు రైతులను గుర్తిస్తామని, పంట బీమా ఇస్తామని వాగ్దానం చేసి వాటిని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం కౌలుదారులను గుర్తించి కార్డులు ఇచ్చి ఎకరాకు రూ.7500 ఖాతాల్లో జమ చేసిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిన బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. రైతాంగ పోరాటాలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిందని, 20 శాతం ఓట్లను కోల్పోయిందని చెప్పారు. ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని న్యాయమైన హక్కుల సాధన కోసం కౌలు రైతులు సంఘటితంగా పోరాడి హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రెండు సంవత్సరాలు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చిందని, ఆ తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు పోకుండా ఉపాధి దొరుకుతుందనే ఆశతో కౌలుకు తీసుకొని పొలాలు సాగు చేస్తున్నారన్నారు. వీరికి పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం అందటం లేదని తెలిపారు. కౌలు రైతులకు కార్డులు అందజేయాలని, ధరణిలో రద్దు చేసిన 26 సెక్షన్‌ పునరుద్ధరించాలని కోరారు. కౌలు రైతులతో జైబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేయాలని, పరస్పర సెక్యూరిటీపై రుణాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర నాయకులు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. 21న మంత్రివర్గ సమావేశం ఉందని, అంతకుముందే కౌలు రైతులు తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమాలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులను సంఘటిత పరిచి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. సమావేశానికి ముందు కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు తాతా భాస్కరరావు జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love