తెలంగాణ పౌరసరఫరాల శాఖ సంస్కరణలకు గుజరాత్‌ ఉన్నతాధికారి కితాబు

Gujarat top official's book on Telangana Civil Supplies Department reforms– సంస్కరణలతో అద్భుత ఫలితాల సాధన : గుజరాత్‌ పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి రమేశ్‌ చంద్ర మీనా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని గుజరాత్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్‌ చంద్ర మీనా అభినందించారు. రాష్ట్రంలో చేపట్టిన ఇ-పాస్‌ వ్యవస్థ విజయవంతమైందనీ, ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తున్నదని కితాబిచ్చారు. ఇ-పాస్‌ సిస్టం ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గతేడాది కాలంగా తీసుకొచ్చిన సంస్కరణలను అధ్యయనం చేసేందుకుగానూ ఆయన మంగళవారం రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పంజాగుట్ట, ఏ.జి కాలనీలలోని జనపోషణ కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్‌.చౌహన్‌లతో కలసి ఆయన సందర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అద్భుతమని ఆయన ప్రశంశించారు.
తెలంగాణా రాష్ట్ర బియ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌ ఆహ్వానించదగిందనీ, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పిలిప్పీన్‌కు బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. సన్న బియ్యం కొనుగోలులో క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించడంతో పాటు మహాలక్షి పథకం కింద అర్హులైన ఎల్పీజీ లబ్దిదారులకు రూ.500 సబ్సిడీ అందించడాన్ని ఆయన ఆహ్వానించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపించడంతో పాటు బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు ధాన్యం కొనుగోలులో వచ్చిన మార్పులు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రమేష్‌ చంద్ర మీనా వ్యాఖ్యానించారు.

Spread the love