వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ గా గుకేశ్‌.. ప్ర‌ముఖుల అభినంద‌న‌ల వెల్లువ‌

నవతెలంగాణ – హైదరాబాద్: భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లలో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి.
ఈ క్షణం కోసం తాను పదేళ్లుగా కలలు కన్నానని గుకేశ్ అన్నాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ విజయాన్ని తాను ఊహించలేదని, ఈ ఘనత సాధించగానే భావోద్వేగానికి లోనయ్యానన్నాడు. తన దృష్టిలో లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్ అని పేర్కొన్నాడు. లిరెన్‌కు అతను ధన్యవాదాలు తెలిపాడు.
భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజుపై ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, తెలుగు రాష్ట్రాల సీఎంలు, క్రీడా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు గుకేశ్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. తాజాగా టాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. మెగా స్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌దిత‌రులు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా గుకేశ్‌ను అభినందించారు.
“వావ్.. జస్ట్ వావ్! నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గుకేశ్‌.. వాట్ ఎ ఫెనామినల్ ఫీట్! భారతదేశం మీ గురించి గర్విస్తోంది! 18 సంవత్సరాల వయస్సులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్. చరిత్రలో 2వ భారతీయుడు మాత్రమే! అన్నింటికంటే పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా మారడం! మేరా భారత్ మహాన్!” అంటూ చిరు ట్వీట్ చేశారు.
గుకేశ్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ తార‌క్‌.. “గుకేశ్‌కు గ్రాండ్ సెల్యూట్‌. భారతదేశపు అద్భుతం, ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్. మీ ప్రయాణంలో మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి” అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
“అభినందనలు గుకేశ్‌. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా అవతరించడం. ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు. జై హింద్!” అంటూ రాజ‌మౌళి ట్వీట్ చేశారు.
అలాగే ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా గుకేశ్‌ను మెచ్చుకున్నారు. “చరిత్రకే చెక్‌మేట్ ప‌డింది! చదరంగం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు గుకేశ్‌కు అభినందనలు. భారతదేశం గర్వంతో వెలిగిపోతోంది! ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థిపై అద్భుతంగా ఆడ‌డం అనేది మా ఛాంపియన్ ప్రశాంతత, ధైర్యాన్ని తెలియజేస్తుంది” అని క‌మ‌ల్ ట్వీట్ చేశారు.

Spread the love