– రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
– ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌జోషి నియామకం
– సుప్రీం తీర్పు వచ్చేవరకు ఆగండి : కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమితులయ్యారు.ఈ మేరకు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా సీఈసీ నియామక తగదని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఆగమని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిషేక్ మను సింఘ్వి , అజరు మాకెన్ మీడియాకు వివరించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భేటీ అనంతరం నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ నియామకానికే కేంద్రం మొగ్గుచూపింది. స్వల్పవ్యవధిలోనే నూతన సీఈసీ నియామకానికి ఆమోదముద్ర వేయటం గమనార్హం.
కేరళ కేడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ ప్రస్థానం
జ్ఞానేశ్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అంతకుముందు ఆయన హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలోని సహకార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖల కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌తోసహా అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన విషయాలను చూసేందుకు హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి ఆయన నేతృత్వం వహించారు. 2029 జనవరి 26 వరకూ ఆయన సీఈసీగా కొనసాగనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది.