వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తే.. మోడీ ఓడిపోయేవారు: రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసి ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓడిపోయేవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కనీసం రెండు, మూడు లక్షల ఓట్ల తేడాతో తన సోదరి చేతిలో పరాజయం పాలయ్యేవారని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించిన ప్రత్యేక సభలో పాల్గొన్న రాహుల్‌, ప్రియాంక గాంధీలు.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలాన్ని తగ్గించేందుకు రాయ్‌బరేలీ, అమేఠీలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘ఇండియా’ కూటమి పార్టీలన్నీ ఐకమత్యంతో పోరాడాయి’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాల విషయంలో అహం ప్రదర్శించబోమని, ప్రజాప్రయోజనాల కోసం కృషి చేస్తామని తెలిపారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సామాన్యులను విస్మరించి.. పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకే మోడీ ప్రాధాన్యం ఇచ్చారని.. అందుకే అక్కడ బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

Spread the love