చిలీ విప్లవాన్ని కాలరాసి అర్థశతాబ్దం

 Half a century since the Chilean Revolutionచిలీలో అమెరికా దన్నుతో జనరల్‌ అగస్టో పినొచెట్‌ నాయకత్వంలో సైనిక తిరుగుబాటు జరిగి అర్థ శతాబ్దం అయింది. 20వ శతాబ్దం ద్వితియార్థంలో అత్యంత కిరాతకంగా పాలించిన ప్రభుత్వాలలో పినొచెట్‌ ప్రభుత్వం ఒకటి. 1973 సెప్టెంబర్‌ 11వతేదీనాడు చిలీ సైనిక దళాలకు చెందిన మూడు విభాగాలు, మిలిటరీ పోలీస్‌ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని, ప్రజలచేత ఎన్నుకోబడిన పాపులర్‌ యూనిటీ నాయకుడు, అధ్యక్షుడు సాల్వడార్‌ అల్లెండే ని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సైన్యం, వైమానిక దళం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి యుద్ధ విమానాలతోను, ట్యాంకులతోను బాంబుల వర్షం కురిపించారు. రాజీనామా చేయటానికి నిరాకరించిన అల్లెండే ఆ ఘర్షణలో మరణించాడు. అదే రోజు సైన్యం వేలాదిమంది కార్మికులను, యువతీ యువకుల ను కాన్సెన్ట్రేషన్‌ క్యాంపులో కుక్కి, హింసించటం జరిగింది. అలా సైన్యం చేత హింసింపబడిన వారిలో అనేకమంది హత్యకు గురైయ్యారు
. అలా హత్యకు గురైనవారిలో ప్రముఖ చిలియన్‌ ఉపాధ్యాయుడు, నాటకకర్త, కవి, గాయకుడు, మ్యూనిస్టు విక్టర్‌ లిడియో జరా మార్టినెజ్‌ కూడా ఉన్నాడు. మార్టినెజ్‌ 1973 సెప్టెంబర్‌ 16వ తేదీనాడు హత్యగా వించబడ్డాడు. తన హత్యగావించబడటానికి ముందు ఫాసిజం ఇంత భయానకంగా ఉంటుందా అని ఆయన ఆశ్యర్యపోయాడు. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ, అమెరికా మిలిటరీ ఇంటెల్లిజెన్స్‌ నిర్దేశంతో కార్మికుల, రైతుల, ఇతర ప్రజాస్వామిక శక్తులకు చెందిన సంస్థలన్నింటినీ నాశనం చేశారు. ప్రతిఘటించటానికి ఎటువంటి ఆయుధాలుగానీ, శిక్షణగానీ, రాజకీయ నాయకత్వం లేని నాయకులను, క్రియాశీలంగావున్న కార్మికులను హత్య చేశారు. పినొచెట్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలంలో ‘చికాగో బోర్సు’ గా పిలువబడిన ‘ఫ్రీ మార్కెట్‌’ ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్మన్‌ టీం ఆదేశాలను పాటించింది. చిలీలో అల్లెండే జాతీయం చేసిన రాగి పరిశ్రమను దాదాపు మూడింట రెండువంతులు అమ్మి వేయటం జరిగింది. అలానే ప్రభుత్వ నియంత్రణలోని బ్యాంకింగ్‌, టెలిఫోన్‌, మెటల్‌ వర్క్స్‌, ఇతర కంపెనీలను ప్రయివేటీకరించటం జరిగింది. కార్మికుల చేత్లుల్లోవున్న పరిశ్రమలను, భూములను ప్రయివేటు యజమానులకు స్వాధీనం చేశారు. నీటిని, పెన్షన్లను, ఆరోగ్య సంరక్షణను, విద్యను, రవాణాను, వసతులను, ఇతర రంగాలను ప్రయివే టీకరించటం జరిగింది. పన్నులను, నియంత్రణలను నామమాత్రంచేసి దేశాన్ని బహుళజాతి కంపెనీలకు, స్థానిక సంపన్న వర్గాలకు ఒక ఆట స్థలంగా మార్చారు.
పినొచెట్‌ నాయకత్వంలో చిలీలో ఫాసిస్టు టెర్రర్‌ రెండు దశాబ్దాలపాటు సాగింది. అనేక వేలమంది రాజకీయ ప్రత్యర్థులు హత్యకు గురికావటమో లేక అద్రుశ్యం అవటమే జరిగింది. 30000మందిని భయంకరంగా హింసించారు. చిలీలో జరిగిన సైనిక తిరుగుబాటు ప్రభావం యావత్‌ లాటిన్‌ అమెరికా పైన పడింది. అమెరికన్‌ సామ్రాజ్యవాదం దన్నుతో అనేక దేశాల్లో సైనిక తిరుగుబాట్లు జరిగాయి. 1964లో బ్రాజిల్‌లోను, 1971లోబొలీవియాలోను, 1973 లో ఉరుగ్వేలోను సైనికతిరుగుబాట్లు జరిగాయి. బ్రెజిల్‌ లోని సైనిక ప్రభుత్వాన్ని ఉపయోగించి అమెరికా చిలీలోని అల్లెండే ప్రభుత్వాన్ని కూలదోసింది. చిలీలో సైనిక తిరుగు బాటు తరువాత యావత్‌ దక్షిణ అమెరికా ఖండంలో ప్రతీ ఘాత విప్లవ శక్తులను సిఐఏ సమీకరించి అణచివేతలను, రాజకీయ హత్యలను కొనసాగేలా చేసింది. అదే క్రమంలో 1976లో అర్జంటీనాలో సైన్యం అధికారంలోకివచ్చి ఫాసిస్టు పాలన సాగించింది.
1973లో చిలీలో అమెరికా దన్నుతో ప్రజలచేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని సైనిక తిరుగుబాటు చేసి కూలదోయటం అనివార్యం ఎందుకు అయిందనే ప్రశ్న ప్రగతిశీల ప్రజానీకాన్ని ఎంతోకాలం వేధించింది. 1970లో ప్రగతిశీల శక్తుల కలయికతో అల్లెండే నాయకత్వంలో చిలీలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. చిలీలో పాత రాజ్య చట్రం లోనే విప్లవ ప్రక్రియ కొనసాగుతుందని అల్లెండే ప్రకటిం చాడు. చిలీలో సైనిక దళాలు, మిలిటరీ పోలీస్‌ ‘యూనిఫాం లోవున్న ప్రజలు’ అని, కార్మిక సంఘాలవలే వీరు కూడా ‘విప్లవ ప్రక్రియకు గట్టి పునాది’ అని కూడా ఆయన ప్రకటిం చాడు. కార్మికులను, ఇతర ప్రగతిశీల శక్తులను సాయుధం చేయకుండా అల్లెండే అనేక జాతీయీకరణలను, సంస్కరణ లను చేశాడు. దానితో చిలీలోని బూర్జువా వర్గం అమెరికాతో కుమ్మక్కయి అల్లెండే ప్రభుత్వాన్ని కూలదోయటానికి, కార్మిక వర్గాన్ని అణచివేయటానికి ప్రణాళికలు రచించింది. 1973 జూన్‌లో సైన్యంలోని ఒక వర్గం అధ్యక్ష భవనంపైకి ట్యాంకు లను పంపి తిరుగుబాటు చేయటానికి ప్రయత్నించి విఫల మైంది. దానితో అల్లెండే ప్రభుత్వం సైన్యానికి రాయితీలను ఇవ్వటం మొదలెట్టింది. పినొచెట్‌ ను సైన్యాధ్యక్షుడిని చేయటమే కాకుండా ఆయన్నుఅల్లెండే తన మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నాడు. అలా అల్లెండే ప్రభుత్వం అమెరికన్‌ సామ్రాజ్యవాదం కుట్రపూరితంగా సైన్యాన్ని తిరుగుబాటుకు సన్నద్దం చేస్తున్న స్థితిలో కూడా కార్మిక వర్గాన్ని, ఇతర ప్రగతిశీల శక్తులను సాయుధం చేయకపోవటం ఆత్మహత్యా సద్రుశంగా మారింది. ఒక విప్లవ పార్టీకి ప్రాతినిధ్యం వహించకపోవటం, నిశ్చయాత్మకమైన విప్లవ నాయకత్వం లేకపోవటంవల్లనే చిలీలో అల్లెండే ప్రభుత్వం ఓటమి పాలయింది. అయినప్పటికీ చిలీ ప్రజల అసమాన త్యాగాలు, వారు చిందించిన రక్తం ప్రపంచ వ్యాప్తంగా విప్లవకర శక్తులకు పాఠాలుగా మారి, వెలుగు దివ్వెలయ్యాయి.

Spread the love