నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

– జులై 1న గ్రూప్‌-4 రాతపరీక్ష
– 9.51 లక్షల మంది దరఖాస్తు
– 2,846 కేంద్రాల ఏర్పాటు
– టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-4 పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జులై ఒకటో తేదీన ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2ను ఓఎంఆర్‌ ఆధారంగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్‌ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌-4కు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశముందని ఆమె తెలిపారు. అందులోనే మార్గదర్శకాలను పొందుపరుస్తామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను ష్ట్ర్‌్‌జూర:// షషష. ్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Spread the love