హమాస్‌ అగ్రనేత కుమారుడు మృతి ?

హమాస్‌ అగ్రనేత కుమారుడు మృతి ?– రఫాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హతం
గాజా : గాజా సిటీపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇక, తాజాగా రఫా నగరంపై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే(22) కూడా మృతి చెందినట్టు సమాచారం. స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్‌ సోషల్‌ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హజెం హనియే ప్రస్తుతం ఓ కాలేజీలో చదువుతున్నట్టు సమాచారం.
రఫా నగరంపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబుల వర్షాన్ని కురిపించింది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా రఫా నగరంపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నట్లు అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు చేయడం గమనార్హం. గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. రఫాపై ఇజ్రాయెల్‌ దాడులను పలు దేశాలు ఖండిస్తున్నాయి. పౌరుల విషయంలో ఒక నిర్ణయానికి రాకుండా రఫాను ఆక్రమించుకోవాలనుకోవడం సరికాదని అమెరికా వాదిస్తోంది. గాజా జనాభాలో సగం మంది అక్కడే తలదాచుకుంటున్నారని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ అన్నారు. వేలాది మంది సామాన్య పౌరులు మరణించే ప్రమాదం ఉందని నెదర్లాండ్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సౌదీ అరేబియా హెచ్చరించింది.

Spread the love