నేతన్నల కోసం చేనేత అభయహస్తం

Handloom for weavers– ఇవీ విధివిధానాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకాన్ని ఈనెల 9వ తేదీ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రారం భించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబం ధించిన విధివిధానాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
నిధులు ఇలా…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలు కోసం ఉన్న నిధులను వెల్లడించారు
1. తెలంగాణ నేతన్న పొదుపు (త్రిఫ్ట్‌ ఫండ్‌)- రూ.15 కోట్లు
పవర్‌లూమ్స్‌, బకాయిలకు-రూ.15 కోట్లు
2. తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా)-రూ.5.25 కోట్లు
3. తెలంగాణ నేతన్న భరోసా – రూ.31 కోట్లు
వేతన ప్రోత్సాహాకాలు (వేజ్‌ ఇన్సెంటివ్‌)-రూ.31 కోట్లు
ఇవీ మార్గదర్శకాలు…
తెలంగాణ నేతన్న పొదుపు (త్రిఫ్ట్‌ ఫండ్‌)
– ఈ పథకం జియో-ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించింది. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పిస్తుంది.
– చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూషన్‌ చేస్తారు. కాంట్రిబ్యూషన్‌ గరిష్ట పరిమితి రూ.1,200. ఇందుకు ప్రభుత్వం రెండింతలు అధికంగా అంటే 16 శాతం అందిస్తుంది. దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందుతారు.
– ఈ పథకం 15 వేలమంది మర మగ్గాల (పవర్‌ లూమ్‌) కార్మికులకూ వర్తిస్తుంది. మర మగ్గాల కార్మికులు తమ వేతనం నుంచి నెలవారీగా 8 శాతం జమ చేస్తారు. వారి గరిష్ట పరిమితి రూ.1,200. ప్రభుత్వం వారి కాంట్రిబ్యూషన్‌కు సమానంగా 8 శాతం కాంట్రిబ్యూషన్‌ చేస్తుంది.
– రికరింగ్‌ డిపాజిట్‌ వ్యవధి మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించారు..
తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా)
తెలంగాణ నేతన్న భద్రత పథకం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్‌ అయిన మొత్తం చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుంది.
– ఈ స్కీంలో నమోదైన కార్మికుడు ఏదైనా కారణంతో మరణిస్తే, నామినీకి రూ.5 లక్షల సొమ్ము అందచేస్తారు.
– తెలంగాణ చేనేత కార్మికుల సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తిస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు ఉన్న 65 ఏండ్ల గరిష్ట వయోపరిమితిని ఎత్తివేశారు. 59 ఏండ్లు దాటిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.
– ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.9 కోట్లు
మార్కెట్‌ మరియు ఉత్పత్తి అభివృద్ధి కార్యక్రమం
– నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం. జియోట్యాగ్‌ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సహాయం అందించబడుతుంది. దీంతో కార్మికులకు వేతన మద్దతు లభించడంతో పాటు నాణ్యత పెరుగుతుంది.
– ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్‌ అంచనా రూ.44 కోట్లు
తెలంగాణ చేనేత మార్క్‌ లేబుల్‌
– తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్‌ లేబుల్‌ రూపొందించారు. దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులను లేబుల్‌ బ్రాండింగ్‌ చేస్తారు. దీన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు, మార్కెట్‌ను సృష్టించి, చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమం, అభివృద్దికి మద్దతుగా నిలుస్తారు.
– దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు
– ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ డైరెక్టరేట్‌ ద్వారా అమలవుతుంది.
– జియో ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాలన్నీ వాటంతటవే రిజిష్టర్‌ అవుతాయి.కొత్త మగ్గాలకు ఆన్‌సైట్‌ వెరిఫికేషన్‌ చేస్తారు.
– తెలంగాణ హ్యాండ్లూమ్‌ మార్క్‌ లేబుళ్లను ఆయా జిల్లాల అసిస్టెంట్‌ డైరెక్టర్లు (ఏడీ) సరఫరా చేస్తారు.
– దీనికోసం కేటాయించిన వార్షిక బడ్జెట్‌ రూ.4 కోట్లు

Spread the love