దళితులను తలకిందులుగా వేలాడదీసి…

–  మహారాష్ట్రలో అమానుషం
ముంబయి : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో పశువులను దొంగిలించారన్న అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి వేధించారు. ఆరుగురు వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాధిత యువకులందరూ 20 సంవత్సరాల వయసు వారే. శ్రీరాంపూర్‌ తాలూకా హరేగాన్‌ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడంతో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై వివిక్ష సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం దళిత యువకులను దుండగులు వారి ఇళ్ల నుండి బలవంతంగా తీసుకొచ్చి చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. కర్రలతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. అమానుష ఘటనను నిరసిస్తూ గ్రామంలో స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. దళిత యువకులపై దాడిని ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీ ఖండించాయి. ఇది మానవతపై జరిగిన దాడి అని కాంగ్రెస్‌ విమర్శించగా రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ చేస్తున్న విద్వేష ప్రచారం ఫలితంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎన్సీపీ ఆరోపించింది. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది.

Spread the love