హ్యాపీ హాలిడేస్‌ పిల్లలై వచ్చి… పిడుగులై మెరిసే…

సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు పిల్లలు. హాలిడేస్‌ను ఆనందించడమే కాదు… అర్థవంతంగాను మార్చుకోవాలి. కొత్త అనుభవాలు సొంతం చేసుకోవాలి. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలకు ఆన్‌లైన్‌గేములకు అతుక్కుపోవడం కాదు. ఆకాశమంత విశాలమైన ప్రపంచం ఉందనీ, వేసవి సెలవులను కూడా ఎంతో వైవిధ్యంగా ఎలా గడపొచ్చో… పాఠ్యాంశాలు కాదు, ప్రపంచాన్ని ఎలా పరిచయం చేయాలో, అవకాశాలివ్వండి అద్భుతాలు ఎలా సృష్టిస్తారో.. మనసు పెట్టి ఆలోచిస్తే. బాల్యాన్ని బంగారు మయం ఎలా చేయొచ్చో…. ఆ దిశగా తల్లిదండ్రులు, పరిపాలకులు సైతం ఆలోచించేలా… తెలంగాణ బాలోత్సవం కొత్తగా ఆలోచించింది. పిల్లలకు ఓ కొత్త లోకం వుందనీ, వారిలో సృజనాత్మకతను వెలికి తీసే వేదిక ఒకటుందని వారికి గుర్తింపజేసింది. ఇది చిన్నారుల స్నేహ సంగమం భవిష్యత్తుపై కొత్త ఆశాలు మోసులెత్తిస్తోంది.
2023 మే 5 నుండి 21 వరకు హైదరాబాద్‌ నడిబొడ్డున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ఉచిత సమ్మర్‌ క్యాంపు 160 మంది బాలబాలికలచే జయప్రదంగా నిర్వహించింది. మే 21న ముగింపు మురిసేలా.. పిల్లల విజ్ఞానం వెలిగేలా.. పదహారు రోజులు పండుగలా ఆడేశారు, పాడేశారు. నేర్చుకున్నవన్నీ తల్లిదండ్రుల సమక్షంలో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే పెరుగుతాయని నిరూపించారు. ఇక్కడ ఆకతాయి పిల్లలు కూడా ఆలోచించేలా, క్రమశిక్షణగా మిగిలారు. సమాజం, మనుషులు, పునాదిగా మౌలిక గుణాల విత్తనాలు నాటారు.
అద్భుత విన్యాసాలు చేశారు
ఆరంభమే ఏ ఆటంకాలు లేకుండా అందరూ సహకరించారు. పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు చక్కటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రోజువారి కార్యక్రమాలకు భిన్నంగా సరదాగా ఆడుతూ పాడుతూ సృజనాత్మకంగా విజ్ఞాన శిబిరంగా సాగింది. కథ చెబుతా! ఊకొడతారా అంటూ కథలు చెప్పారు. కథలు ఒక తలుపు లాంటిది. అది ప్రపంచానికి దారి. మనల్ని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళే దారి. కథ ఒక గవాక్షం. కథ ఒక తాళం చెవి అని నిరూపించారు. కవిత్వం అల్లారు, పాటలు పాడారు. పేపరు పెన్ను ఇస్తే చాలు, అద్భుత విన్యాసాలు చేశారు. తెలుగు పద్యాల వల్లెవేత, తెలుగు భాష మాధుర్యం, భాష ప్రాధాన్యతను గుర్తింపజేసింది ఈ క్యాంప్‌. జాతి భవితకైనా, భాష మనుగడకైనా పిల్లలే ఆశాదీపాలు అని చాటి చెప్పింది. సామరస్య జనజీవన సంస్కృతిని వివరించింది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ నేర్పింది. శాస్త్ర విజ్ఞాన విషయాలు, సైన్స్‌ ప్రయోగాలు చేసి చూపించింది. అవి పిల్లలతో చేయించడం, మూఢనమ్మకాల గుట్టును బట్టబయలు చేసింది. మా అజ్ఞానాన్ని పోగొట్టి, మమ్ముల్ని జ్ఞానవంతులుగా చేసిందని సమ్మర్‌ క్యాంపు పిల్లల మాట. పేర్‌ క్రాఫ్ట్‌లో పిల్లలకు రంగురంగు కాగితాలు ఇచ్చి చూస్తే.. ఎగిరే పక్షుల్ని, ఏనుగు బొమ్మల్ని, పేపర్‌ బొకేలను మనకిచ్చి వావ్‌ అనిపించారు. బాల సాహిత్యం గురించి చెప్పారు. బాల సాహిత్యం అంటే కళా స్వరూపం. దాని ఆశయం ఆనందమయం. దాని గమ్యం, జ్ఞాన ప్రధానం అన్నట్టు సాగింది.
చిందులతో అదరగొట్టారు
లఘు నాటికలు నేర్పి నాటికలపై అసక్తిని పెంచారు. కళలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. రేపటి పౌరులను సంస్కార వంతులుగా తీర్చిదిద్దే తోవలో నడుస్తామని గంగా అనే నాటిక వేసి ప్రదర్శించారు. శబ్ద, జల, వాయు కాలుష్యాలు, ప్లాస్టిక్‌ వినియోగం, రసాయనిక ఎరువుల వాడకం, ఫ్యాక్టరీ యజమానుల దుర్మార్గాలు ఎండగట్టారు. తెలంగాణ పల్లె జానపదాలు, చిరుతలు చిందులతో అదరగొట్టారు. వారిలో ఆకాశమంతా ఆలోచనలున్నాయి. సముద్రమంత లోతైన భావనలున్నాయి. వయసుకు మించిన తెలివితేటలున్నాయి. కొత్త విషయాలు నేర్చుకున్నారు. కొత్త స్నేహితులును పొందారు. నూటికి 90 శాతం ఆడపిల్లలే పొల్గొన్నారు. అన్ని రంగాల్లో వారే ప్రతిభను కనబరిచారు. వారిలో క్రమశిక్షణ నేర్చుకోవాలనే తపన కనబడింది.
ఆత్మవిశ్వాసాన్ని నింపింది
ఆడపిల్లలంటే సివంగులనీ… కన్నీళ్ళు కాదు, కన్నెర్ర చేయాలనీ, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. ఈ పిల్లల అభిప్రాయ పత్రాలను పరిశీలిస్తే అందరూ బాగ్‌లింగంపల్లి పరిసర ప్రాంతం పిల్లలే. ఎక్కువ మంది పేదపిల్లలే. లక్షల ఫీజులు పోసి ప్రైవేటుకి వెళ్ళలేని గరీబుల పిల్లలే. తెలంగాణ బాలోత్సవం పైన తల్లిదండ్రులు ఏ భరోసాతో పంపినారో అదే భరోసాతో అప్పగించాం. పిల్లలుగా వచ్చి పిడుగులుగా వెళ్తున్నామనే ఆత్మవిశ్వాసాన్ని నింపింది వేసవి విజ్ఞాన శిబిరం. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకే కాని పిల్లలు పట్టుదలతో సాయంత్రం 5 గంటల వరకు ఆటపాటలతో అతుక్కుపోయారు. వారిని కంటికి రెప్పలా చూసుకున్నారు నిర్వాహక కమిటి. భావిభారత పౌరులను బాధ్యతగా పట్టించుకుంది. తెలంగాణ బాలోత్సవం కమిటి పిల్లల్లో పిల్లలై పోయారు. వయసు, ఆంక్షలు, పరిమితులు మర్చిపోయి పిల్లలతో కేరింతలు కొట్టారు. ఆడారు, పాడారు. ఆయుష్షు పెంచుకుని ఆనందంగా ఆరోగ్యంగా గడిపారు. ప్రజ్ఞలో ప్రతిభలో మేం తక్కువ కాదని నిరూపించారు. మా బాలల బంధువు తెలంగాణ బాలోత్సవం అని, మా ఆనంద నిలయం సుందరయ్య విజ్ఞాన ఆలయం అని పిల్లలు కేరింతలు కొట్టారు. హ్యాపీ హాలిడేస్‌ను ఆనందంగానే కాదు, అర్థవంతంగా నిర్వహించగలిగాం. కొత్త అనుభవాలు, రెట్టింపు ఉత్సాహంతో కొత్త తరగతిలోకి, సృజనలోకంలోకి అడుగుపెడుతున్న బాలలకు జయహో.
– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343

Spread the love