దళిత మహిళపై కర్కశత్వం

Harassment on Dalit woman– షాద్‌నగర్‌లో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు
– దెబ్బలు తట్టుకోలేక దాహమని అడిగితే నీళ్లు తాపి మరీ టార్చర్‌
– దొంగతనం చేసిందనే అనుమానంతో అదుపులోకి
– ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
– విచారణకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం
– వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటాం : శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌
– బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బృందం
నవతెలంగాణ-షాద్‌నగర్‌
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అమానుషం చోటుచేసుకుంది. జై భీమ్‌ సినిమా తరహాలో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ దళిత మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిర్ధాక్షిణ్యంగా చిత్రహింసలకు గురిచేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లీ కొడుకును దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు స్పృహ తప్పి పడిపోగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని ఫిర్యాదుదారుని తో బాధితురాలి తలకు, కాళ్లకు జండూబామ్‌ రాయించారు. ఫిర్యాదుదారుని కారులోనే బాధితుల ను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..షాద్‌నగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన నాగేందర్‌ తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన సునీత-భీమయ్య దంపతులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో దొంగతనం ఆరోపణలపై డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ రెడ్డి, మరో నలుగురు పోలీసు సిబ్బంది సునీత- భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు సునీతతోపాటు 13 ఏండ్ల కుమారుడు జగదీష్‌ను స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. తల్లి, కొడుకును పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్‌ చేశారు. డీఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురిచేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి బూటు కాళ్లతో తన్ని మరీ కన్న కొడుకు ముందే చితకబాదినట్టు బాధితురాలు తెలిపింది. దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు జగదీశ్‌ను కూడా అరికాళ్ళపై రబ్బర్‌ బెల్ట్‌తో కొట్టారు. దెబ్బలకు తాళలేక సునీత స్పృహ తప్పిపోగా ఆమెను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే పంపించడం గమనార్హం. నాగేందర్‌ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ఎదుట బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతేనని భావించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానీ కేవలం ఆరోపణల నేపథ్యంలో మహిళలపై పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 తులాల బంగారం, రూ. రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అందులో తులం బంగారం, రూ.నాలుగు వేలు రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మహిళపై పోలీసుల దాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్టు శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. వాస్తవాలు తేలితే మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బృందం
పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి షాద్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీతను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బృందం ఆదివారం పరామర్శించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ప్రీతం.. ఆమెను పరామర్శించి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం సిగ్గుచేటని, మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా వ్యవహరించడం హేయమైన చర్య అని అన్నారు. మహిళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.

Spread the love