పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత : హరీశ్‌రావు

– ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్సిట్యూట్‌లో అంకాలజీ బ్లాక్‌ ప్రారంభం
నవతెలంగాణ-అంబర్‌పేట
పేదల వైద్యానికి కేసీఆర్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌ లక్డికపూల్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్సిట్యూట్‌లో నూతన అంకాలజీ బ్లాక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎన్‌జే చారిత్రక ఆస్పత్రిలో నూతన బ్లాక్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి బిల్డింగ్‌ను నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్డింగ్‌ రావడంతో పడకల సంఖ్య 750కి పెరిగిందని.. ప్రభుత్వం పరంగా రూ. 60 కోట్లతో ఇక్కడ అన్ని సదుపాయలు కల్పించామని చెప్పారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో కాన్సర్‌ ట్రీట్మెంట్‌కు 2వ అతి పెద్ద ఆస్పత్రిగా ఎంఎన్‌జే నిలిచిందన్నారు. కొత్త బ్లాక్‌లో ప్రత్యేకంగా వుమెన్‌ వింగ్‌, పెడియాట్రిక్‌ వింగ్‌ రానున్నాయని తెలిపారు. చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బ తినకుండా ఉండేందుకు పెడియాట్రిక్‌ వింగ్‌లో లైబ్రరీ, టీచర్‌ను ఏర్పాటు చేసి ట్రీట్మెంట్‌తో పాటు విద్యను కూడా అందిస్తామన్నారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. వీరికి ఆరోగ్య శ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇక ఆస్పత్రి శానిటేషన్‌, సెక్యూరిటీ నిర్వహణకు ముందుకొచ్చిన ప్రముఖ వైద్యులు అద్దంకి శరత్‌, సినీనిర్మాత సునీతను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో వైద్య సేవలను ఎంతో పటిష్టం చేశామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఏంఎన్‌జే వంటి హాస్ప్పటళ్లు బలోపేతం చేశా మన్నారు. మరోవైపు నాలుగు టిమ్స్‌, వరంగల్‌ హెల్త్‌ సిటీ, నిమ్స్‌ విస్తరణతో 10వేల పడకలు సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ను మరో ఏడాదిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. వైద్య విద్యకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న దని, ఈ సంవత్సరం మరో 9మెడికల్‌ కాలేజీలు ప్రారంబిస్తామని తెలిపారు. కాన్సర్‌ రోగులకు త్వరలో జిల్లాల్లో కీమో, రేడియో థెరపీలను జిల్లాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. టీ డయాగ్నోస్టిక్‌ సెంటర్స్‌ ద్వారా కాన్సర్‌ డిటెక్షన్‌ చేయను న్నామని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, టీఎస్‌ఎంస్‌ ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అరబిందో ఎండీ నిత్యనంద రెడ్డి, అరబిందో డైరెక్టర్‌ రఘునాథన్‌, హెల్త్‌ సెక్రటరీ రిజ్వి, ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత పాల్గొన్నారు.

Spread the love