నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చెప్పిన తులం బంగారం కేవలం మాటలకే పరిమితమైందని.. బంగారం మాట దేవుడెరుగు.. కనీసం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు కూడా ఇవ్వడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శించారు. పెన్షన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం హామీలు విస్మరించారన్నారు. పెన్షన్‌దారులకు రెండు నెలలుగా పెన్షనే రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. డీజిల్‌కు డబ్బుల్లేవని… మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. హాస్టళ్లలో పని చేసే కార్మికులకు కూడా జీతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.