నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ కులవృత్తుల వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం పంపిణీ కోసం జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు హరీశ్ రావు, కమలాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఈ మేరకు వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కులవృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో బ్యాంకు ఖాతా లింక్ లేకుండానే లక్ష రూపాయలను ఇస్తున్నట్లు చెప్పారు. వివిధ కులవృత్తుల్లో కొనసాగుతున్న వారి అభివృద్ధి కోసమే ఈ పథకం తీసుకు వచ్చామన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ చేతులమీదుగా మంచిర్యాలలో లబ్ధిదారులకు చెక్కులు అందిస్తామని, అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కలిసి ఆయా లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వాలన్నారు. కులవృత్తుల వారికి ఆర్థిక సాయం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. లబ్ధిదారులను గుర్తించి ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేలతో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ పథకం కింద పనిముట్లు, పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆయా కులవృత్తుల లబ్ధిదారులకు సహకరిస్తామని, అదే సమయంలో వాటిని ఆన్ లైన్ లో నమోదు చేసి రెండేళ్ల వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు.