హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ అవకాశమిచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్ ఇచ్చిందని హరీశ్ ఆరోపించారు. పీపీటీ కోసం తమకూ అవకాశమివ్వాలని కోరామని.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశమివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, భారాస విజయమని తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ఈ ప్రకటన చేశారని.. తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వినలేదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యమాని వ్యవసాయం సంగతి అటుంచితే.. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీశ్‌రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు.