శ్రీధర్ రెడ్డి హత్యఫై హరీశ్ రావు స్పందన

నవతెలంగాణ – హైదకాబాద్; వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో దారుణ హత్య జరిగింది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి(45)ని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఆరు బయట నిద్రిస్తున్న శ్రీధర్‌ రెడ్డిని గొడ్డలితో నరికి చంపడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదన్న హరీశ్ రావు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Spread the love