లక్ష్యం మేరకు హరితహారం : కలెక్టర్‌

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణకు హరితహారంలో భాగంగా 2023-24 కార్య ప్రణాళిక లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ సూచించారు. ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా అధికారులతో కలిసి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో కలెక్టర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, హార్టికల్చర్‌, ట్యాంక్‌ బండ్‌ ప్లాంటేషన్‌, కెనాల్‌ బండ్‌, అవెన్యూ ప్లాంటేషన్‌, హరితవనాలు, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, సంస్థాగత ప్లాంటేషన్‌, హౌమ్‌ స్టెడ్‌ కింద 19,87,750 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మండలాల వారీగా గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి లొకేషన్లను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించినట్లు, 3,13,068 యాక్టివ్‌ వేజ్‌ సీకర్లు ఉన్నట్లు, 69,548 వేజ్‌ సీకర్లు రిపోర్ట్‌ చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీల పెంపుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పని ప్రదేశాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ, త్రాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పనులు ఎండ తీవ్రత పెరగకముందే ముగించేలా చూడాలని అన్నారు. జిల్లాలో 754 ఆవాసాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు లక్ష్యం కాగా, 480 చోట్ల స్థల గుర్తింపు చేసి, 468 పనులను గ్రౌండింగ్‌ చేపట్టి, 460 పూర్తి చేసినట్లు వివరించారు. మిగులు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ-2023 లో గ్రామ, జిల్లాస్థాయి లో నిర్దేశిత లక్ష్యాల మేరకు మార్కులు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛ సర్వేక్షన్‌ లో ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యం తేవాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ సహాయ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, డివిజనల్‌ పంచాయతీ అధికారులు పుల్లారావు, ప్రభాకర్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love