– తమిళనాడు, బెంగాల్ ఇంటిబాట
వడోదర (గుజరాత్): విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా, రాజస్థాన్‌లు ముందంజ వేసి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాయి. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచుల్లో ఓడిన తమిళనాడు, బెంగాల్ జట్లు ఇంటిముఖ పట్టాయి. హర్యానాతో మ్యాచ్‌లో బెంగాల్ 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత హర్యానా 50 ఓవర్లలో 9 వికెట్లకు 298 పరుగులు చేసింది. పార్థ్ వాట్స్ (62), నిశాంత్ సింధు (64) సహా సుమిత్ కుమార్ (41 నాటౌట్) రాణించారు. బెంగాల్ పేసర్ మహ్మద్ షమి (3/61) మూడు వికెట్లతో రాణించాడు. ఛేదనలో బెంగాల్ చతకిలి పడింది. 43.1 ఓవర్లలో 226 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ (57) అర్థ సెంచరీ సాధించినా.. ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. మరో మ్యాచ్‌లో తమిళనాడుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. అభిజిత్ తోమర్ (111), మహిపాల్ (60) మెరుపులతో తొలుత రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267/10 పరుగులు చేసింది. ఛేదనలో తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జగదీశన్ (65), విజరు శంకర్ (49) రాణించినా తమిళనాడు విజయానికి చేరువ కాలేదు. శనివారం, ఆదివారం క్వార్టర్‌ఫైనల్ మ్యాచులు జరుగుతాయి.