హత్రాస్‌ లైంగికదాడి కేసు

– ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఆగ్రహం
– ముగ్గురు నిందితులపై ఆరోపణల్ని కొట్టేసిన కోర్టు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నవేళ..ఒక లైంగికదాడి కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు (ఈనెల 3న) సంచలనం రేపింది. ఈ కేసులో నలుగురు నిందితులుగా ఆరోపణలు నమోదుకాగా, ముగ్గురు నిందితులపై లైంగికదాడి ఆరోపణల్ని కొట్టేస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో ఒకే ఒక వ్యక్తి ప్రధాన నిందితుడిగా మిగిలాడు. ఈ తీర్పు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలు తన మరణవాంగ్మూలంలో నలుగురి పేర్లు చెప్పిన తర్వాత కూడా, కోర్టు నుంచి ఈ విధమైన తీర్పు వెలువడటాన్ని దళిత, ఆదివాసీ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తీర్పును యూపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లైంగికదాడి, హత్య ఘటన సెప్టెంబర్‌ 2020లో చోటుచేసుకుంది. ఘటన జరిగి ఇంతకాలమైనా న్యాయస్థానంలో దోషులకు శిక్ష పడకపోవటాన్ని సామాజిక కార్యకర్తలు, దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నలుగురు నిందితులు ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందినవారు కావటం వల్లే కేసును బలహీన పరుస్తున్నారని, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ఎస్పీ నిందితు లకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ”అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ కోర్టు నుండి ఇలాంటి తీర్పు వచ్చింది. ఇది తెలిసాక మహిళా దినోత్సవాన్ని అణగారిన వర్గాలు జరుపు కుంటాయా? కుల ఆధారిత ఈ సమాజంలో మహిళల హక్కులకు గౌరవం లేదు. సామాజిక న్యాయం, సమానత్వం కోరుకునే వారికి కోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చింది” అని శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో దళిత, ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Spread the love