– ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 20న హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్ల ఎన్నికకు శనివారం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 20న ఎన్నికలు జరుగనుండగా.. 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల అధికారి, భారత ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ వి.ఎస్ సంపత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 20న జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు అవసరమైతే ఓటింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇదివరకే బహుళ యాజమాన్య ఆధీనంలోని క్లబ్‌లకు తాజా ఎన్నికల్లో ఓటు హక్కు రద్దు చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ అనుబంధ క్లబ్‌లు, సంస్థలు, మాజీ క్రికెటర్లతో కలిపి 173 మందికి ఓటు హక్కు కల్పించారు. ఈ మేరకు పూర్తి వివరాలను హెచ్‌సీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.