నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికాలోని ఓ స్కూలులో టీనేజర్ కాల్పులు జరిపాడు. గన్ తో స్కూలుకు వచ్చిన విద్యార్థి నేరుగా క్యాంటీన్ కు వెళ్లి ఓ విద్యార్థినిని కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నాష్ విల్ లోని అంటియోక్ హైస్కూలులో చోటుచేసుకుందీ దారుణం. దీనిపై మెట్రో పోలీసు అధికార ప్రతినిధి డాన్ ఆరోన్ మీడియాతో మాట్లాడుతూ.. అంటియోక్ హైస్కూలులో ఓ విద్యార్థి (17) గన్ తో కాల్పులు జరిపాడని చెప్పారు. స్కూలు క్యాంటీన్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో జోస్లిన్ కొరియా ఎస్కలాంటే అనే పదహారేళ్ల విద్యార్థిని మరణించిందన్నారు. ఆపై నిందితుడు కూడా అదే గన్ తో కాల్చుకుని చనిపోయాడని వివరించారు. ఈ కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితుడు జోస్లిన్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడా? లేదా? అనేది విచారణలో తేలుతుందని అన్నారు. కాల్పుల ఘటనలో మరో విద్యార్థికి బుల్లెట్ గాయాలయ్యాయని, బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.