లక్ష జనాభా లేనోడు ముఖ్యమంత్రి అయ్యిండు

– ఉపకులాల వారు ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు
– రాజ్యాధికారం అంతిమ లక్ష్యం కావాలి
– బహుజన సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ- అడిక్‌మెట్‌
లక్ష జనాభా లేనోడు ముఖ్యమంత్రి అయ్యిండు..ఉపకులాల వారు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యమని బహుజన సమాజ్‌ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు ఇవ్వాలని 57 ఎస్సీ ఉపకులాల మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న, 57 ఉపకులాల అధ్యక్షులు చింతల రామలింగం,ఎంపీ ఆర్‌ కష్ణయ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ధర్మ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్‌ మహరాజ్‌, టి ఎంఆర్పిఎస్‌ అధ్యక్షులు ఇటుక రాజు, జొన్న కనకరాజు, దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జేబీ రాజు, హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ. రాష్ట్ర పాలకులు మనకు తెలియకుండానే మన మెదళ్లను కేవలం సంక్షేమ పథకాలకు పరిమితం చేస్తున్నారని, ఓట్లేసేది మనం..వాళ్ళ జెండాలు మోసేది మనమే..కానీ మన పరిస్థితి దుర్బరంగా ఉంది అన్నారు. దొంగలు రాజులై సెక్రటేరియట్‌లో కూర్చుంటున్నారని అన్నారు. మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అని తెలిపారు. ఇంకా ఎన్నేళ్ళు ధర్నా చౌక్‌లో ధర్నాలు చేస్తారు.మీ డిమాండ్లు చాలా చిన్నవి. ఇవన్నీ ఒక్క సంతకంతో వస్తాయి.మనం పాలకులము అయితే ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 30% కమీషన్‌ తీసుకున్నారు. జీఓ 111 రద్దు చేసి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం వాళ్ళు సంపాదించుకున్నారు. కాంట్రాక్టులో 7 వేల కోట్ల రూపాయలు కమీషన్‌ తింటున్నారు.30 వేల ఏకరాల భూమిని మన నుండి గుంజుకొని పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది ఈ ప్రభుత్వం.కొందరి తెలంగాణ నుండి విముక్తి చేసి పేద ప్రజల అమర వీరుల తెలంగాణ తెచ్చుకోవాలి అని పిలుపునిచ్చారు. తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు మాదిగ ఉప కులాలకే సరిగ్గా ఇవ్వడం లేదు 57 ఉపకులాలకు ఇస్తాడా అని ప్రశ్నించారు. కేసిఆర్‌ వేసిన దళిత బంధు ఉచ్చులో చిక్కుకున్నారు. మీరు.కొడంగల్‌లో పుట్టిన రేవంత్‌, హైదరాబాద్‌లో పుట్టిన కవిత నిజామాబాద్‌, నల్గొండలో పుట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరిలో పోటీ చేసిన ఈ సంచార జీవులకు మీకు ఏం తేడా లేదు. మీరు అందరూ మమ్మల్ని ఓసిలో కలపండి అని డిమాండ్‌ చేయండి. మీ అసలు డిమాండ్లను పరిష్కారం అయితయి అని తెలిపారు. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ 10% అయినా వస్తది ఒక శాతం జనాభాకు 10% రిజర్వేషన్‌ ఇస్తున్నారు.లక్షల జనాభా ఉన్న మీకు 57 కులాలకు 5% రిజర్వేషన్‌ ఉన్నది ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.వెలమలు ఎప్పుడన్నా ధర్నా చౌక్‌ లో ధర్నా చేశారా? అధికారం వాళ్ళ చేతిలో ఉంది.అధికారం మన చేతిలో ఉంటే మన సమస్యలు పరిష్కారం అయితాయి అన్నారు. తెలంగాణలో బాలసంతల గుడిసెల కంటే…వెలమల ఇల్లే తక్కువ ఉన్నాయన్నారు. ఓటు హక్కు లేకపోతే తమను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదని.ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఈ ధర్నాలో 57 ఉప కులాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love