ఆయనకు సంఘ్ తో సంబంధాలు!

He has connections with the Sangh!– ఎన్టీఏ ఛైర్మెన్‌ జోషీపై గతంలో ఇంటెలిజెన్స్‌ నివేదిక
– ఆర్‌ఎస్‌ఎస్‌ సిఫారసులతోనే 2006లో ఎంపీపీఎస్‌సీ ఛైర్మెన్‌ పదవి
– 2009లో ప్రొఫెసర్ల నియామకంలో భారీగా అవకతవకలు
న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ సిఫార్సు మేరకు 2006లో మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎంపీపీఎస్‌సీ) ఛైర్మెన్‌గా ప్రదీప్‌ కుమార్‌ జోషీని నియమించారు…ఇది సమాచార హక్కు చట్టం కింద బహిర్గతమైన సమాచారం ఆధారంగా హక్కుల కార్యకర్త అజరు దూబే చేసిన ఆరోపణ. 2009లో జోషీ హయాంలో జరిగిన ఫ్రొఫెసర్ల నియామకంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని అజయ్‌ తెలిపారు. ఆ ప్రదీప్‌ కుమార్‌ జోషీయే ప్రస్తుతం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఏ నిర్వాకం కారణంగా పలు ప్రవేశ పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేదా తిరిగి నిర్వహించడమో జరిగిన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీల నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ను మోడీ ప్రభుత్వం గత నెల 22న పదవి నుండి తప్పించింది. రోజువారీ కార్యకలాపాలకు డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యుడవుతారు. కానీ నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఛైర్‌పర్సనే. కానీ ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఆయన కుర్చీని వీడడం లేదు. జోషీ గతంలో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో యూపీఎస్‌సీ పగ్గాలు చేపట్టారు. గత సంవత్సరం ఆగస్ట్‌ 14 ఎన్టీఏ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సంఘ్‌ సిఫార్సు మేరకే…
జోషీకి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, బీజేపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆర్‌టీఐ ద్వారా హక్కుల కార్యకర్త దూబే పొందిన విశ్వసనీయ ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతోంది. ఈ నివేదికను 2006 జూన్‌ 8న మధ్యప్రదేశ్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ రూపొందించింది. దానిని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కార్యదర్శికి పంపారు. ఇంటెలిజెన్స్‌ నివేదికలో భాగంగా సంఘ్‌ ప్రచారక్‌ వినోద్‌జీ సంతకం చేసిన చేతిరాత నోట్‌ను కూడా అప్పటి ముఖ్యమంత్రికి పంపారని దూబే తెలిపారు. ‘ప్రదీప్‌ జోషీ ఏబీవీపీకి నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఆయన జబల్పూర్‌లోని రాణీ దుర్గాదేవి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కావాలని అనుకుంటున్నారు’ అని ఆ నోట్‌లో ఉంది. సంఫ్‌ు సిఫారసు మేరకే జోషీని ఎంపీపీఎస్‌సీ ఛైర్మెన్‌గా నియమించారని దూబే ఆరోపించారు.
ఆనాడే అవకతవకలు
2009లో ఎంపీపీఎస్‌సీ ఛైర్మెన్‌గా జోషీ పనిచేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖలో ఫస్ట్‌ క్లాస్‌ గెజిటెడ్‌ ప్రొఫెసర్ల నియామకాలలో అవకతవకలు జరిగాయి. ఈ వ్యవహారం హైకోర్టు వరకూ వెళ్లింది. తప్పుడు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్ల ఆధారంగా అనర్హులైన వారిని ప్రొఫెసర్లుగా నియమించారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా పదవి నుండి తొలగించబడిన ఎన్టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ గత సంవత్సరం జూన్‌లో అందులో చేరారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సన్నిహితుడని అంటారు.

Spread the love