అతడొక వెంటాడే వాక్యం

”ఇలాగ రాయాలని నాకెవ్వరు చెప్పలేదు. రాయడం ద్వారా.. నిరంతర అధ్యాయనం ద్వారా నేను తెలుసుకున్నాను” అని కవి శివారెడ్డి అంటారు. ఆ దారిలోనే గుండెను ఆకురాయి చేసుకొని సానబెట్టుకుంటూ రాస్తున్న మహాబూబాబాద్‌ జిల్లా పెద్ద గూడూరు గ్రామానికి చెందిన కవి తండ హరీష్‌ గౌడ్‌. వత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ‘నీటి దీపం, ఇన్‌ బాక్స్‌, గాలిలేని చోట’ మూడు కవిత్వ పుస్తకాలను ప్రచురించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్‌ అందుకున్నాడు. గాలిలేని చోట కవిత్వ పుస్తకానికి గాను రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు – 2024 లో కె.ఎల్‌ నర్సింహారావు అవార్డు అందుకుంటున్న సందర్భంగా…
కళ్ళముందు కదిలే దశ్యాల్ని కవిత్వవాక్యాల్లోకి ఒంపగలడు. తనను తాను చెక్కుకున్నట్టుగా కవిత్వాన్ని కూడా ఎక్కడి వరకు చెక్కలో అక్కడి వరకే చెక్కగలడు. కవిత్వ ఒడుపును తెల్సుకున్నవాడు. ఇతను పంట హదయాన్నే కాదు బొబ్బలెక్కినా చెక్కుచెదరని రైతుల ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఇతను మరణానికి ప్రేమలేఖ రాయగల ధైర్యశాలి. గోడలని నవ్వించగలడు. గడ్డకట్టిన గుండెలను కరిగించగలడు. ఓడిపోతున్న వాళ్ళనంతా గెలిపించాలనే వాక్య ప్రేమికుడు. ఇతను రొట్టెలు చేసే తల్లుల చేతుల భాషను నేర్పించగల నేర్పరి. పొయ్యిరాళ్ళ మధ్యలోకి సూర్యుణ్ణి తీసుకొచ్చి పెట్టగల సమర్థవంతుడు. నక్షత్రాలను తుంచుకొని తినగల ఉహానైపుణ్యుడు. చందమామలకి నదులను రుద్దే ప్రయోగకారుడు.
ఈ కవిది అమ్మ స్పర్శ.. నాన్న బాధ్యత. ఈ కవికి చీకటి మాటున దాగిన వెలుతురు తెలుసు. ఖాళీ సీసాను పాఠంగా చెప్పగలడు. నిండు సీసాను టెక్నిక్‌ గా కదిలించగలడు. తన బాల్యాన్ని జారుడు బండమీద నుండి నెమరేసుకుంటున్నాడు. ఇప్పటి పిల్లల స్మార్ట్‌ ఫోన్‌ కాలాన్ని దశ్యామానం చేసి రాస్తున్నాడు. ఎక్కడ అగ్గిపెట్టను ముట్టించాలో.. ఆలోచనను ఎట్లా నూరుకోవాలో తెలుసు. కల్లుకుండ వెతలను మాట్లాడుతాడు. తాటి ముంజల కిరణాలతో జ్ఞాపకాలను చిలికించగలడు. తెలుగిప్పుడు పచ్చిపుండు దేహమని లోపలి బాధను మాట్లాడగలడు. ఇతడు అద్దాన్ని ప్రేమించిన మనిషి.. అద్దం లాంటి మనస్తత్వాన్ని ప్రకటించుకున్న మనిషి.

గడిచిపోయిన బాల్యాన్ని నెమరేసుకుంటూ రేపటి కాలానికి ప్రేమవాగుల్ని తయారు చేసుకుంటున్న కవి. నాన్నను దిక్సూచిగా మార్చుకున్న కవి. బఠానీల అమ్మల కష్టాన్ని యూనివర్సిటీ పాఠాల్లో కూడా దొరకదని సర్టిఫికెట్‌ ఇచ్చి మురిసిపోయిన మనిషి.
ఆకాశాన్ని నచ్చినట్టు మలుచుకున్న కవి, చంద్రుణ్ణి చెక్కి కవిత్వం చేయగల కవి. పాఠాలు చెప్పే ఉద్యోగం చెయ్యడం వల్లే కావొచ్చు కవిత్వాన్ని పాఠంగా మలచడంలో ఒడుపు పట్టుకున్నాడు.
కవిత్వ దీపంతో మనిషిని వెలిగిస్తుంటాడు. వాక్యాల రెక్కలతో కలలు మేల్కొపుతాడు. ఆశల పువ్వుల పరిమళాన్ని పదాలుగా విసురుతుంటాడు. చెట్టు కూలిపోతే కలవరపడుతున్నాడు. నీళ్ళు దూసుకొస్తే అప్రమత్తం చేస్తుంటాడు. ఊపిరాడని కాలంలో కవిత్వపు ఆక్సిజన్‌ గా మారి కదులుతుంటాడు, కదిలిస్తుంటాడు. ఈ కవి నిత్య నూతనంగా కవిత్వపరిమళాన్ని తన ఇన్‌బాక్స్‌ అనే గుండెవాల్‌పై పోస్ట్‌ చేస్తుంటాడు.
నీటిదీపం పుస్తకంలో భిన్నమైన వస్తువులను స్పర్శించాడు. తన చుట్టూ తనలో తిరిగే కాలాన్ని కవిత్వంగా మలిచాడు. వెలిగించాడు. నోస్టాల్జియా జ్ఞాపకాలను పూయించాడు.
”అక్కడికి వెళ్లినన్ని నాళ్ళు
నీ వయసుని
అక్కడక్కన్నే తిప్పుతాడు
రంగెలిసిన నిన్ను రంగవల్లికను చేసి
పాలిపోయిన నిన్ను
పౌడర్‌ పువ్వుతో అద్ది
నవ మన్మథుడిలా బయటకొదులుతాడు”.
(ప్రతివాన్ని గెలిపిస్తూ) అనే కవితలో మంగలి వత్తి చేసే అద్భుతాన్ని పట్టుకున్నాడు. వాళ్ళ జీవితాన్ని మరింత అందంగా డిజైన్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. ఇలా తన చుట్టూ కదిలే చాలా వస్తువులను కవిత్వంగా చెప్పడం చాలా చోట్ల కనిపిస్తుంది.
ఇన్‌బాక్స్‌లో డేటా క్షణాల్లోకి తీసుకెళ్లాడు. డిజిటల్‌ తనంలోకి లాక్కెళ్లాడు. పిల్లల మానసికతను మాట్లాడాడు. కాసింత ప్రేమను ఆవిష్కరించాడు. కరోన కఠినమైన సంకెళ్ళని రికార్డు చేశాడు. క్లాస్‌ రూముల్లోంచి కూడా గొంతు విప్పాడు. ఎటువైపుగా నిలబడాలో తేల్చేశాడు.
”మనుషులిప్పుడు
అనుబంధాలను, ఆప్యాయతలను
డేటాతో కొనబడ్డ
ఓ ‘కొత్త ఆప్‌ రూపాలు” (ఆన్‌లైన్‌) అని బలమైన ఆధునికతను చెప్పాడు అనడానికి ఇది ఉదాహరణ. ఇదే భాషలోనే విలేజ్‌ రింగ్‌ టోన్స్‌ వినిపించాడు.
గాలిలేని చోటలో మనిషి మీద మూత్రం పొసే వాడిని నాలుగో మనిషిగా ప్రకటిస్తూ వాడిని మనుషుల్లోంచి వేరు చేస్తూ మనిషివైపుగా నిలబడుతున్నాడు. తను పెరిగిన జీవనదారుల్లో ఎదురైన అడవిని కోల్పోతున్న కాలాన్ని తలుచుకుంటున్నాడు. ఉపాద్యాయుడి బాధ్యతను సోకు కవితగా మాట్లాడాడు. ఈ కవికి ధిక్కరించే గుణం వుంది. ఏ సమయంలో ఏ కోణంలో ధిక్కరించాలనే స్పష్టత వుంది. దీనిలో చెట్టుకూలిన గాయం ఉంది. ఆశల గురించి, శ్వాసల గురించి ఉన్నాయి. అమ్మల గురించి, శ్రమ జీవుల బతుకుల గురించి ఉన్నాయి. బిల్కిస్‌ బానో లాంటి బాధితుల దుఃఖపు పొర వుంది. మణిపూర్‌ విషాదం లాంటి నగకవితలు ఉన్నాయి. ఈ కవి బాధిత గొంతుగా కన్నీటి గాథలను జాతీయ గీతాలుగా పాడుతున్నాడు. ఈ కవి తనదైన చూపుతో.. తనదైన గొంతుతో సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసేలా రాస్తున్నాడు. ఏ కవి అయిన తన కవిత్వంలో తప్పకుండా బయటపడాల్సిందే. ఆ క్రమంలోనే కవి తనను తాను వ్యక్తీకరించుకుంటాడు.
‘నాది అద్దానిది
పగిలిపోయే మనస్తత్వమే
ఎందుకంటే ఇద్దరం
కావాలని విసిరే రాళ్ళను భరించలేము.’
(I& mirror) అంటూ తానేంటో తానే చెప్పుకున్నాడు. ఒకానొక సందర్భంలో
”నేను
బొబ్బలెక్కిన పాదాలను
నెత్తిమీదకు తెచ్చుకునేవాడిని
అహంకార శిరస్సును
పాదాలకు తొడుక్కునే వాడిని” అని ప్రకటిస్తాడు.
ఈ కవికి ప్రవహించే గుణం వుంది. వాక్యమై వెంటాడే లక్షణం వుంది. దశ్యాలు దశ్యాలుగా మనలోకి ఎక్కించగలడు. పదాలుగా లోపల శబ్దమవ్వగలడు. కవి సీతారాం అన్నట్లు ఇతని దగ్గర ప్రమాదకర ఆయుధాలు ఏమీ లేవు, కవిత్వం తప్ప. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అతను అతనిలాగే అర్థమవుతాడు. స్పూర్తినిస్తాడు.
– పేర్ల రాము, 9642570294

Spread the love