పేరుకు పోయిన మట్టి అట్టడుగున
మనిషి కోసం…
మనిషిని పదార్థంగా
వ్యధార్థంగా అర్థరహితంగా
విపరీతార్థవిలోమ కల్లోలితంగా
ఏమార్చిన పొరలను
ఒక్కోక్కటీ వొలిచేస్తూ
అసలు రూపాన్ని
కనుగొనే పయనంలో…
తనను తాను ఆవిరి చేసుకుని
విశ్వవ్యాప్తమైనవాడు
అతడే… అతడే!
జ్ఞానపు కీకారణ్యంలో
చెట్టునూ పుట్టనూ
పువ్వునూ పుప్పొడి
రేణువుల పరిమళాన్ని
ఆస్వాదించి సాధించిన
విజ్ఞాన వనమాలి అతడే…
చెమట తడిలో మొలకెత్తి
విశ్వాంతరమై ఎగబ్రాకిన
పెట్టుబడి గుండెలపై కూర్చుని
దశాబ్దాల జీవితాన్ని
చుట్టముక్కలుగా కాల్చి
దాని రహస్యాన్ని రాల్చినవాడు
అతడే… అతడే…
సత్య సౌందర్యానంద సమ్మోహితుడు
నిత్య శ్రామిక ప్రేమికుడు
మానవతా సౌధంపై
ఎగిరే పతాకం
ఇదిగో…
ఇన్ని వర్థంతుల తర్వాత కూడా
శత్రువు అదిరిపడేలా
బ్రతికే ఉన్నాడు
అతడు నిజమైన మనుష్యుడు
చిరంజీవుడు కామ్రేడు
(మార్క్స్ వర్థంతికి జోహార్లతో)
– కె. ఆనందాచారి