నవతెలంగాణ – ఆసిఫాబాద్: ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువతిని కొట్టి.. పురుగు మందు తాగించి హత్య చేసిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరలోకి వేలితే.. వెంకట్రావ్‌పేటకు చెందిన బూడే దీప(19) ఇంటర్ అనంతరం చదువు మానేసి కూలీ పనులకు వెళ్తోంది. అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా దీపను ప్రేమిస్తున్నానని వెంట పడుతుండగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని, కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టేవాడు. ఈ తరుణలో గత ఆదివారం దీప కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడ్డ కమలాకర్.. తనను ప్రేమించకుండా వేరే వాళ్లతో మాట్లాడుతున్నావంటూ ఆమెను కొట్టాడు. అనంతరం అక్కడున్న పురుగు మందును బలవంతంగా ఆమె నోట్లో పోసి పారిపోయాడు. బాధితురాలు బయటకు వచ్చి కాపాడాలంటూ చుట్టుపక్కల వారిని కోరగా.. వెంటనే సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. మృతురాలు సోదరుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితుడి కమలాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.