ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్‌తో కోట్లు కొట్టేశాడు..

నవతెలంగాణ – అహ్మ‌దాబాద్ : ఫేక్ ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్‌ను త‌న భాగ‌స్వాముల‌తో క‌లిసి క్రియేట్ చేసిన ఓ చైనీయుడు రూ. కోట్లు కొల్ల‌గొట్టిన మెగా స్కామ్‌ను గుజ‌రాత్ పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. కేవ‌లం తొమ్మిది రోజుల్లోనే వీరు 1200 మంది నుంచి ఏకంగా రూ. 1400 కోట్లు దండుకున్న‌ట్టు వెల్ల‌డైంది. ఈ స్కామ్‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారి చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన వూ ఉయంబెగా గుర్తించారు. 2020, 2022 మ‌ధ్య ఉయంబె భార‌త్ టూర్ సంద‌ర్భంగా గుజ‌రాత్‌లోని ప‌టాన్‌, బ‌న‌స్‌కంత జిల్లాల నుంచి ఈ భారీ మోసానికి తెర‌లేపిన‌ట్టు తేల్చారు.  ఈ కేసును ఛేదించేందుకు గుజ‌రాత్ పోలీసులు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. నిందితులు గుజ‌రాత్‌, యూపీలో మొబైల్ యాప్ దానీ డేటా పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ట్టు 2022 జూన్‌లోనే పోలీసులు హెచ్చ‌రించారు. ఆగ్రా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన అనంత‌రం సీఐడీ క్రైమ్ టీం రంగంలోకి దిగ‌డంతో ఉత్త‌ర గుజ‌రాత్‌లోని ప‌లువురు వ్య‌క్తులు ఈ భారీ దందాలో పాలుపంచుకున్న‌ట్టు గుర్తించారు. చైనా జాతీయుడు ఉయంబె ప‌టాన్‌, బ‌న‌స్‌కంత జిల్లాల్లో మ‌కాం వేసి ప‌లువురు స్ధానికులను క‌లిసి ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ ద్వారా భారీ లాభాలు మూట‌గ‌ట్టుకోవచ్చ‌ని మ‌భ్య‌పెట్టాడ‌ని త‌మ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ యాప్‌లో బెట్టింగ్స్ ప్లేస్ చేయ‌డం ద్వారా అధిక రిట‌న్స్ వ‌స్తాయ‌ని త‌న అనుచ‌రుల‌తో పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌బ‌లికి స్కామ‌ర్లు మోస‌గించార‌ని చెప్పారు. ఈ స్కామ్‌ను గుర్తించి కేసు న‌మోదు చేసే స‌మ‌యానికి ఉయాంబే భార‌త్ విడిచివెళ్లాడు.

Spread the love