నవతెలంగాణ – నెదర్లాండ్: ఓ కొడుకు తన తండ్రి మృతిని తట్టుకోలేక.. అతడి మృతదేహాన్ని ఏడాదిన్నర పాటు ఫ్రిజ్ లో పెట్టి దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. విషయం వెలుగులోకి వచ్చి ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే తండ్రితో మాట్లాడాలని అలా చేశానని చెప్పాడు. మరణించిన వ్యక్తి కొడుకు వయసు 82 కావడం విశేషం.. నెదర్లాండ్‌లోని ల్యాండ్‌గ్రాఫ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఓ డచ్ వ్యక్తి (82).. తన తండ్రి 101 ఏళ్ల వయసులో వయోభారంతో మరణించాడు. ఐతే తండ్రి మరణించి 18నెలలవుతున్నా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించ లేదు. ఎవరికీ తెలియకుండా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ కుటుంబం ఫ్యామిలీ డాక్టర్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించారు. ఫ్రిడ్జ్ లో మృత దేహాన్ని భద్రపరచడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ వ్యక్తిని ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావని ప్రశ్నించగా.. తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని, తన తండ్రితో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేనని, అందుకే 18 నెలలుగా తండ్రి డెడ్ బాడీని ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. ఇప్పటికీ రోజూ తండ్రితో మాట్లాడుతున్నానని అతను చెపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తండ్రి మృతికి సంబంధించి కొడుకుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.