నవతెలంగాణ – లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడనే కోపంతో ఓ బాలుడు మరో బాలుడిని గొంతు పిసికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ మండలం రహ్తి డేరా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రహ్తి డేరా గ్రామంలో పిల్లలంతా కలిసి బుధవారం ఉదయం క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఓ 14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా 17 ఏళ్ల బాలుడు పిచ్‌ను వదిలి వెళ్లేందుకు నిరాకరించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంతలో 17 ఏళ్ల బాలుడి సోదరుడు కూడా అతనికి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి 14 ఏళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టారు. కింద పడేసి గొంతు పిసికి చంపారు. అనంతరం ఇద్దరూ పారిపోయారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు అంత్యక్రియలు చేయబోమని హెచ్చరించారు. ఆ తర్వాత పై అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పోస్టు మార్టానికి అంగీకరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.