ప్రకృతి కోపానికి కేరళ రాష్ట్రంలోని వాయినాడ్ అల్లాడిపోయింది. శవాల దిబ్బగా మారింది. కొండచరియలు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. మొత్తం 295 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ విషాద సంఘటనకు దేశం యావత్తు కంట తడిపెట్టుకుంది. మనుషుల్లోని మానవతను తట్టి లేపింది. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు తమ వంతుగా సహాయసహకారాలు అందించారు. అలాంటి వారిలో దీపా జోసెఫ్ ఒకరు. తన బాధంతా దిగమింగి ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
కేరళ రాష్ట్రంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవి చూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితలను రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడు కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని ఆమె చెబుతోంది. ఒక్కోసారి తనకు కూడా కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది.
ధైర్యంగా సాగిపోయింది
గతంలో దీపా కాలేజీ బస్సు డ్రైవర్‌గా పని చేసేది. కరోనా సమయంలో ఆమె ఉద్యోగం పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పని చేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే తన కన్న కూతురు బ్లడ్ క్యాన్సర్‌తో మరణించడంతో దీప డిప్రెషన్‌కి వెళ్లిపోయింది. ఆ బాధతో ఉద్యోగం కూడా వదిలేసుకుంది.
తట్టుకోలేకపోయింది
వాయనాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించాలని ఆమె నిర్ణయించుకుంది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ… సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసు కుంటూ, బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా.
ఇక వృత్తిని కొనసాగిస్తా
వయనాడ్ ఘటన అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం ఆమె ఇంకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తానని తెలిపింది. నిజానికి ఆమె తన జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా… వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం నిజంగా స్ఫూర్తిదాయకం.