నవతెలంగాణ – చెన్నై
మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పట్టపగలు ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తెన్‌కాశి జిల్లా సెంగోట్టై విశ్వనాథపురానికి చెందిన రాజేష్ (25) సెంగోట్టై మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాజేష్ యథావిధిగా విధులకు హాజరయ్యాడు. కార్యాలయం లోపలి వెళ్లి తిరిగొచ్చి తన బైక్ స్టార్ట్ చేసేందుకు రాజేష్ వెళ్తుండగా ఓ ముఠా మారణాయుధాలతో అతనిపై పైశాచికంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో బైక్‌పైనే రాజేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సెంగోట్టై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెన్‌కాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈలోగా మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించడంతో పాటు హంతకులను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులు అరెస్టుకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పట్టపగలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో హత్య జరగడంతో అధికారులు, ఉద్యోగులు, చుట్టుపక్కల వారు బిత్తరపోయారు.