పనివేళలు మార్చెేదెన్నడు…!

సింగరేణి వ్యాపితంగా…భానుడి ప్రతాపానికి భగభగ మండుతున్న ఓసీలు

300మీ లోతు ఓసీల్లో
51 డిగ్రీల ఉషోగ్రతలు
అ ఆర్జి రెండు ఓసీపీలో3లో ఎండ వేడికి
డిజిల్‌ ట్యాంకర్‌ దగ్ధం
అ తక్షనం పనివేళలు మార్చి సౌకర్యాలు
కల్పించండి : సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌
యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి మందా నర్సింహారావు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రచండం ఉగ్రరూపం దాలుస్తోంది. ఓసీ పరిసర ప్రాంతాలు వేడికి సెగలు కక్కుతున్నాయి. బొగ్గుగనులపై అడుగు పెడితే వేడి మంటకు ఒంటిమీద కారంపొడి పడిందన్నట్లుగా ఒళ్ళంతా భగభగ మండిపోతోంది. ఒంట్లోని నీరంతా ఆవిరైపోతోంది. గొంతు తడారిపోతోంది. దీంతో కార్మికులు డ్యూటీలకు వెళ్లడానికే భయపడుతున్నారు. మామూలుగా గ్రామాలు, పట్టణాల్లో సరాసరి ఉష్టోగ్రతలు 45డిగ్రీలు ఉంటోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు వేడికి అల్లాడుతున్నారు.
నవతెలంగాణ-ఇల్లందు
గత 15 రోజులుగా సింగరేణి వ్యాపితంగా గనులు ఉన్న ఏరియాల్లో ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా 48డిగ్రీల వరకు ఉంటున్నాయి. అగాధాల్లా ఉండే ఓసి క్వారీల్లో 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఇప్పటికే ఉన్న వేడి తట్టుకోలేక పోతున్న కార్మికులకు ఈనెల 25న రోహిణీ కార్తె ఉంది. రోహిణీ కార్తెలో రోళ్ళు పగిలే వేడి ఉంటుందంటారు. దీంతో మరీ భయపడుతున్నారు. రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి ఖ్మమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలా బాద్‌ జిల్లాలలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఓపెన్‌ కాస్ట్‌లు 19, భూగర్భగనులు 18 ఉన్నాయి. ఓసిల్లో 9528, భూగర్భగనుల్లో 24, 127 డిపార్టుమెంట్స్‌వారితో కలిపితే మొత్తం 42,955 మంది పనిచేస్తున్నారు. వీరంత ఎండ, వాన, చలిని తట్టుకుని యాజమాన్యం పెట్టే టార్టెట్‌కు మించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. యేటా రూ.కోట్ల లాభాలు తెచ్చిపెడుతున్నారు. దేశానికి వెలుగులు అందిస్తున్నారు. అయినప్పటికీ మండు టెండలో వేడిని తట్టుకుని పనిచే స్తున్నా తగిన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యగా వ్యవహరిస్తోంది. వడ దెబ్బకుగురై ఆసుపత్రిపాలైతె కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా అంటున్నారు కార్మికులు. వీస్తున్న వడ, వేడి గాలలకు కార్మికులు సొమ్మసిల్లుతు అవస్ధ లు పడుతున్నారు. పనివేళలు మార్చాలంటూ సిఐటియు, టిబిజికెఎస్‌, ఐఎన్‌టియుసి, ఏఐటియుసి కార్మిక సంఘాలు యాజామాన్యానికి వినతిపత్రాలు ఇచ్చి కోరుతున్నప్పటికి పట్టించుకోవడంలేదు. ఇంకెన్నడు పనివేళలు మార్చుతారంటూ కార్మికులు మండిపడుతున్నారు.
రక్షణ చర్యలు లేవు : వేడి గాలులు తట్టుకోలేక కార్మికుల అవస్ధలు
పని ప్రదేశాల్లో చలువ పందిళ్ళు, మంచినీరు నిల్‌ సింగరేణిలో బొగ్గుగనులు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, గోదావరిఖని, బెల్లంపల్లి తదితర పట్టణాలలో 43 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదవుతున్నాయి. ఓసిలుల్లో సుమారు 45డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలుంటున్నాయి. ఏరోజుకారోజు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇక సింగరేణి కార్మికుల ఇబ్బందులు చెప్పనలవి కావు. బయట ఎండ వేడికి ఓసిలో కొన్ని ఏరియాల్లో బొగ్గు మండుతూ పొగలు చిమ్ముతున్నాయి. రామగుండంలోని ఓసిపిలో3లో సర్పేస్‌ ఫీడర్‌ వద్ద గురువారం డిజిల్‌ ట్యాంకర్‌తో సహా క్యాబిన్‌ పూర్తిగా దగ్ధమైంది. ట్యాంకర్‌లో పూర్తిగా ఇంధనం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఓసీలో డంపర్స్‌, షేవల్స్‌, డ్రిల్స్‌, గ్రడ్డర్స్‌, ఎస్‌కార్డ్స్‌, వర్కర్స్‌, వేహికల్స్‌ నడిపే డ్రైవర్స్‌, ఇతర సిబ్బంది కలిపి 33,655 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒఆర్‌ ప్యాకెట్లు 2, మజ్జిగ ప్యాకెట్‌ 200మీలీ.ఒక్కటి మాత్రమే ఇస్తున్నారు. మంచినీటి క్యాన్‌లు కార్మికులకు ఇవ్వాల్సిఉండగా ఇవ్వడంలేదు.
భూగర్భగనిలో గాలి వచ్చే ఏర్పాట్లు చేయాలి
సింగరేణి వ్యాపితంగా భూగర్భగనులు 18 ఉన్నాయి. ఇందులో 24,127 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భూగర్బగనులు 500 ఫీట్ల లోతులో ఉంటుందని తెలిసింది. లిఫ్ట్‌ ద్వార కార్మికులు భూగర్భ గనిలో దిగుతారు. ఇక్కడి నుండి గులాయిలద్వారా దాదాపు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళీ పని చేస్తుంటారు. భూగర్భ గనుల్లో వేడి అత్యధికంగా ఉంటుంది. లోపల ఉండే కార్భండై ఆక్సైడ్‌ బయటకు పంపి ఆక్సిజన్‌ను లోపలికి పంపే ఏర్పాట్లు సరిగా లేకపోవడంవల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దారుణం
సింగరేణి వ్యాపితంగా బొగ్గుగనుల్లో సుమారు 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పటికి వారికి కల్పించే సౌకర్యాలు ఏమాత్రం వర్తింపజేయడంలేదు. చట్టబద్దమైన హక్కులు అసలేలేవు. మజ్జిగ ప్యాకెట్స్‌ ఏమోకాని కనీసం మంచినీరు సౌకర్యంలేదని వారంటున్నారు.
మజ్జిగ, రాగుల జావ ప్యాకెట్స్‌, చల్లటి వాటర్‌ క్యాన్‌లు ఇవ్వాలి
మొగిలి ఓసి-3, రామగుండం
గతంలో 250మీలీ మజ్జిగ ఇచ్చేవారు. ప్రస్తుతం 200మిలీ మజ్జిగ ఒక్క ప్యాకెట్‌ మాత్రమే ఇస్తున్నారు. వేడి తుట్టుకుని నీరసించిపోకుండా కనీసం 4 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి. ఓసి క్వారీల్లో చల్లని వాటర్‌ క్యాన్‌ల సౌకర్యం కల్పించాలి. మధ్య హన్నం రాగుల జావతోపాటుగా గరిమిని తట్టుకునే ఆహార పదార్ధాలు అందించాలి. క్వారీలు,ఓసిల వద్ద ప్రాధమిక చికిత్సలు, అత్యవసరానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలి.
తక్షణం పనివేళలు మార్చి సౌకర్యాలు కల్పించండి
ఓసీలు, భూగర్భగనుల్లో కార్మికులు వేడిమి తట్టుకోలేకపోతున్నారు. తక్షనం పనివేళలు మార్చి, సౌకర్యాలు కల్పించాలి. గత 20 రోజులుగా ఎండవేడి మికి కార్మికులు భరించ లేకపోతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా పనివేళలు మార్చితే కొంత ఉపశమనంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నం ఒంటిగంట వరకు, 2 గంటల నుండి రాత్రి 11 వరకు, రాత్రి 11 నుండి తెల్లవారు ఝామున 5 గంటలవరకు పనివేళలు మార్చాలి.
: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు

Spread the love