నవతెలంగాణ- అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్‌పైనా నేడు ఎసిబి కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి.. సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిలు కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు ఈనెల 10న జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అనినీతి నిరోధ చట్టం సెక్షన్ 17 ఎ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ పాటించలేదని.. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతపై ఎఫ్ఐర్ నమోదు చేయాలన్నా, దర్యాప్తు కొనసాగించాలన్నా కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. చట్టానికి విరుద్దంగా అరెస్ట్ చేశారని అంతటితో ఆగకుండా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్‌కు ఐపీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరగా.. 18 వరకూ హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు తదుపరి విచారణ జరగనుంది.