నవతెలంగాణ – హైదరాబాద్: అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు. కాగా సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ వ్యవహారం గురువారం రోజంతా టెన్షన్ పెట్టింది. అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు వెలువరించే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరికి… విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఇక… అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ చుట్టూ అవినాశ్ అనుచరుల హల్‌చల్ గురువారం కూడా కొనసాగింది. షిఫ్టులవారీగా ఆస్పత్రి వద్ద బైఠాయిస్తూ హల్‌చల్ చేశారు. అక్కడి పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు తీయకుండా అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఫొటోలు తీస్తున్నట్లు గుర్తిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా దాడులకు తెగబడుతున్నారు. కడప జిల్లా నుంచి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా కర్నూలుకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లే దారిలో ప్రైవేటు ఆస్పత్రులకొచ్చే రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.