అసెంబ్లీలో వేడెక్కిన నీళ్ల చర్చలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడోరోజు సోమవారం ప్రారంభమయ్యాయి. దివంగత నేతలు మచిందర్‌రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సభ సంతాపం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశముంది, దీనిపై ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో ప్రకటించనుంది. టొబాకో, సిగరెట్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌పై ఆర్థికమంత్రి ప్రకటన చేయనున్నారు. అలాగే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల మంటలు చెలరేగనున్నాయి, ప్రాజెక్ట్స్ వార్ పతాకస్థాయికి చేరింది. రేపు ‘చలో నల్లగొండ’కు బీఆర్ఎస్ పిలుపిచ్చింది. అలాగే మంగళవారం ‘చలో కాళేశ్వరం’ కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపిచ్చింది. బీఆర్ఎస్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే.. ఒప్పుకున్నారని, ఏపీ సీఎంతో కుమ్మక్కై నీటి వాటాను వదిలేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణకు నష్టం చేసే ఒప్పందాలపై.. కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని ప్రభుత్వం మండిపడుతోంది. సమగ్ర వివరాలతో అసెంబ్లీలో ఈరోజు శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. గట్టిగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ చేసింది. కాగా ఇవాళ్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేదిలేదు : మంత్రి ఉత్తమ్‌
కృష్ణా జలాల వివాదం, ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోంది. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్‌పైకి పోలీసులను పంపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేదిలేదని స్పష్టం చేశారు.“రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించాం. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళ్లింది. పదేళ్లపాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ 219 టీఎంసీలకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకుంది. ప్రతి ఏడూ దిల్లీకి వెళ్లి 512: 219 టీఎంసీలకు ఒప్పుకున్నారు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైంది. బచావత్ ట్రిబ్యునల్‌ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Spread the love