స్వర్గం – నరకం

స్వర్గం - నరకంపెద్ద హాలు. హాలులో అనేకమంది. అనేక మంది గాలిలో ఊగుతూ వున్నారు. హాల్లో కూర్చుందుకు కుర్చీల్లేవు మరి. వేదిక మీద ఓ అరడజను మంది వున్నారు. తలలకి కొమ్ములు, చేతుల్లో దుడ్డుకర్రలూ వున్నాయి. అందరి కంటే పొడవాటి కొమ్ములున్న వాడొకడు లేచి బిగ్గరగా అరిచేడు. ‘భూమ్మీద పంచప్రాణాలూ వదిలేసినందున మీరందరూ గాల్లో ఊగుతున్నారు. మా ఆకారాలు మా చేతుల్లో దుడ్డుకర్రలూ చూస్తే మీకర్ధం అయి వుండాలి. మేము ఎవ్వరమో!’
‘అర్ధమయ్యిందిలే! ఎంతసేపిలా గాల్లో ఊగులాడమంటారు?’ అన్నారెవరో గుంపులోంచి, ఊగుతూ నించోవడానికి బద్దకమేసి.
‘అదే చెబుతున్నా’ అన్నాడు పొడుగు కొమ్ములవాడు. ‘ఊరికే నసపెట్టకు, నాకు నాన్చకు. చెప్పాల్సిందేమిటో చెప్పరాదూ’ అన్నాడు ఆరుగురు కొమ్ముల వాళ్లల్లో చిన్నకొమ్ములున్నవాడు.
‘సరే! సరే! మీరంతా భూమ్మీద ‘హుశ్‌పటక్‌, మటాష్‌ అయిపోయినోళ్లే. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నది డిసైడ్‌ చెయ్యడానికే ఈ మీటింగ్‌’ అన్నాడు పొడుగు కొమ్ములవాడు దుడ్డుకర్రతో వీపు గోక్కుంటూ.
‘మా ఖర్మ ఎల్లాగుంటే అల్లాగవుతుంది. ఎక్కడికో అక్కడికి తొందరగా తీసుకెళ్లండి’ అన్నాడొకడు గుంపులోనుంచి.
‘ఖర్మాలేదు. గాడిదగుడ్డూ కాదు. ఇప్పుడంతా మారిపోయింది. మేమూ ప్రజాస్వామ్యాన్నే పాటిస్తున్నాం. చెప్పండి మీ ఇష్టం. మీలో ఎవరెవరు స్వర్గానికి వెళదామనుకుంటున్నారో చేతులెత్తండి’ అన్నాడు పొడుగు కొమ్ముల స్వంత దారుడు.
ఊగులాడుతున్నవాళ్లు ఒక్క క్షణం బిత్తరపోయేరు.
‘నిజంగానా! ఇప్పుడంతా మారిపోయిందా?’
‘మేం ఎక్కడికి వెళ్తామంటే అక్కడికేనా? సరాసరి స్వర్గమేనా? వారెవ్వా? క్యాబాత్‌ హై’.
‘ఎంత నీచ నికృష్టపు పని చేసినా స్వర్గానికి వెళ్లిపోవచ్చునా? ఈ సంగతి ముందే తెలియదే! ఎన్నో ఛండాలపు పనులు చేయకుండానే వచ్చానే! చచ్చానే. అరెరే’.
రకరకాలుగా అనేక రకాలుగా అల్లరల్లరిగా అరవసాగారు కొందరు. స్వర్గం వెళ్లే అవకాశం ఎవరు వదులుకుంటారు. తటపటాయించకుండా ముందస్తుగా చేతులెత్తినవాళ్లని ఇద్దరు కొమ్ములవాళ్లు దుడ్డుకర్రల్తో అదిలిస్తూ వేదిక ముందుకు తీసుకువచ్చారు.
అందరికంటే ముందు చేతులు ఎత్తిన వాళ్లని ‘మీరంతా ఎవరు?’ అనడిగాడు దుడ్డుకర్రల గ్యాంగ్‌ లీడర్‌.
‘మేమంతా రాజకీయ నాయకులం. ప్రజాస్వామ్యాన్ని పెంచి ప్రజల్ని పోషించాం. ప్రజాసేవలో తరించిపోతుంటే మా ప్రాణాల్ని హరించి ఇక్కడికి తీసుకువస్తుంటే చచ్చాం. సారీ చచ్చి వచ్చాం’ అన్నారు రాజకీయ నాయకులు.
‘దేనికయినా సరే, మేమున్నామని మాకే కావాలని ముందుగా ముందుకు వచ్చేది మీరే కదా! మీకెందుకు స్వర్గం. ప్రతి గల్లీ లీడరూ స్వర్గమే కావాలంటే జాగా చాలదు. ‘బుగ్గ’ కార్లల్లో తిరుగుతూ అనుభవించారు కదా ఆల్రెడీ స్వర్గసుఖాలు’ అన్నాడో దుడ్డుకర్ర.
‘ఏంటి అనుభవించింది. ఏ సమయంలో ఎవడు కొంప ముంచుతాడో తెలీక అనేక టెన్షన్లతో, గన్‌మెన్‌లను కాపలా పెట్టుకుని, ఏ పార్టీలో వుండాలో, ఏ పార్టీలోకి దూకాలో తేల్చుకోలేక నానాయాతన్లు పడ్డాం’ అన్నారు పొలిటీషియన్లు.
‘అలవాటైన ఉపన్యాసాలు వద్దు. కోటికి కోట్లు సంపాదించేరు కదా!’ అన్నదో దుడ్డు కర్ర.
‘సంపాదించిందంతా ఓట్లు కొనడానికే పోయింది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జనాలు ఓట్లేస్తారని గ్యారంటీ లేదు. ఒక్కోసారి డబ్బూపాయె. డిపాజిట్లూ పాయె. మా కష్టాలు మీకు అర్ధం కావు. స్వర్గానికి వెళ్లగలిగిన అర్హత వున్నది మాకే’ అని మూకుమ్మడిగా అరిచారు బకెట్లు తన్నేసి వచ్చిన లీడర్లు.
ఆ తర్వాత యింకా ఎవరెవరు స్వర్గానికి వెళ్తారో చేతులెత్తండి అని పొడుగు కొమ్ములవాడనగానే వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు దొర్లుకుంటూ ముందుకురికారు మేమంటే మేమంటూ. వ్యాపారస్తులు ప్రజల్ని దోచుకోవడమంటే ఏమిటో తెలీదన్నారు. డాక్టర్లు చచ్చిన వాళ్లకే ఆపరేషన్లు చేసి డబ్బు గుంజటమా రామ రామ అన్నారు. లాయర్లు అబద్దమనగానేమి అన్నారు. వీరందరూ రాజకీయ నాయకులతో పాటు తమందరినీ కచ్చితంగా స్వర్గానికే తీసుకుపోవాలన్నారు.
హాలులో మిగిలిన జనాలకేసి చూశాడు పొడుగు కొమ్ములున్నవాడు.
‘అయ్యా! ఇన్నాళ్లూ పాపం చేసిన వాళ్లు నరకానికి, పుణ్యం చేసినవాళ్లు స్వర్గానికి వెళ్తారనుకునేవాళ్లం. పైలోకంలో కూడా భూమ్మీదలాగానే ప్రజాస్వామ్యం ఇంత పకడ్బందీగా వెలుగుతున్నదని పాపం చేసిన వాళ్లంతా హాయిగా స్వర్గానికి వెళ్లవచ్చని ఇప్పుడే తెలిసింది. ఇందుకేనేమో భూమ్మీద పాపం పాపంలా పెరిగిపోతున్నది. మేమంతా సామాన్య మానవులం. ముద్దుగా మమ్మల్ని ‘కామన్‌ మ్యాన్‌’ అంటారు. ఎలక్షన్లప్పుడూ, బై ఎలక్షన్లప్పుడూ ఓట్లు వేసేవాళ్లం మాత్రమే మేం. ఇప్పుడు స్వర్గానికి వెళ్తామంటున్న వాళ్లంతా భూమ్మీద మమ్మల్ని నానా హింసలూ పెట్టినవాళ్లే. వీళ్లు చూపించడం వల్ల నరకం అంటే ఏమిటో మాకు బాగా తెల్సివచ్చింది. స్వర్గానికి పోయినా వీళ్ల పోరు మళ్లీ మాకెందుకు? మాకు అలవాటయిన నరకానికే పోతాం కానీ స్వర్గానికయినా సరే వీళ్ల వెంట వెళ్లం’ అన్నాడు సామాన్య జనంలోంచి ఓ బక్కచిక్కిన శాల్తీ ముందుకు వచ్చి.
మేం నరకానికే పోతాం! మాకు నరకమే అలవాటయ్యింది’ అని అరిచారు మామూలు జనం.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love