ముంచెత్తిన వాన

Heavy rain– హైదరాబాద్‌లో కుండపోత భారీగా ట్రాఫిక్‌ జామ్‌
– చెరువులను తలపించిన రోడ్లు కొట్టుకుపోయిన వాహనాలు
– జిల్లాల్లో తడిసిన ధాన్యం
– పిడుగుపాటుకు నలుగురు మృతి
– మృత్యువాతపడిన మూగజీవాలు
హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి కుండపోత వాన పడింది. పంటలు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు… మరోవైపు పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. హైదరాబాద్‌లో దంచికొట్టిన వానక రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నాలాలు పొంగిపొర్లాయి. వాహనాలు కొట్టుకుపోయాయి.
నవతెలంగాణ- మొఫసిల్‌
యంత్రాంగం అకాల వర్షంతో రాష్ట్రమంతా అతలాకుతలమైంది. మహబూబ్‌నగర్‌, భూత్పూర్‌, వనపర్తి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. భూత్పూర్‌ ప్రాంతంలో గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల జొన్న పైరు నేలకొరిగింది. ఇంద్రవెల్లి మండలంలోని లాల్‌టెకిడి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఇండ్ల పైకప్పులు పడిపోయాయి. ధాన్యం తడిసి ముద్దయింది. ఈశ్వర్‌నగర్‌ గ్రామం వద్ద ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రాంతంలో సాయంత్రం భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆరంగర్‌ నుంచి అత్తాపూర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉప్పరపల్లి ప్రధాన రోడ్డుపై చెరువులను తలపించేలా వర్షపు నీరు ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. శివరాంపల్లి రోడ్డు వద్ద వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సిబ్బందితో అక్కడకు చేరుకొని మ్యాన్‌హోల్‌లో చెత్తను తొలగించడంతో వర్షపు నీరు వెళ్లిపోయింది. బాబుల్‌ రెడ్డినగర్‌లోని కొన్ని ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చింది. నర్సాబారు కుంట వద్ద ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు వేసిన పైప్‌లైన్‌ అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికి డ్రెయినేజీ నిండి నీరు ఇండ్లలోకి చేరింది.
సిద్దిపేట జిల్లా మర్కుక్‌, తొగుట మండల పరిధిలోని ఐకెపీ కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయి కొట్టుకుపోయింది. గజ్వేల్‌లో వర్షానికి చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. మెదక్‌ జిల్లా రామాయంపేట మండల పరిధిలో బుధవారం రాత్రి ఈదురు గాలులు, ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధర్మారం గ్రామానికి చెందిన జెల్ల యాదగిరికి చెందిన ఆవు పిడుగుపాటుకు మృత్యువాత పడింది. పాపన్నపేట మండలం అరేపల్లి గ్రామానికి చెందిన మస్కరి హన్మంతు జీవాలు పొలంలో మేత మేస్తుండగా.. పిడుగు పడటంతో మృత్యువాతపడ్డాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌, తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వీచడంతో అరటితోటల్లో చెట్లు విరిగాయి. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో మామిడి కాయలు రాలాయి.
నగరం.. అతలాకుతలం
హైదరాబాద్‌ నగరంలో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. పలుచోట్ల నాలాలు, మ్యాన్‌ హౌల్స్‌ పొంగి పొర్లాయి. మోకాలిలోతు నీరు చేరడంతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని స్టీల్‌ బ్రిడ్జితోపాటు పంజాగుట్ట, బేగంపేట వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌ డివిజన్‌లోని ఉదయనగర్‌ కాలనీలో నాలా స్లాబ్‌ కొట్టుకుపోయింది. వరద ఉధృతికి అదే ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన నాలా కప్పులు
బంజారాహిల్స్‌లోని రోడ్‌ నం.9, 11లో వరద ఉధృతికి నాలా పై కప్పు కొట్టుకుపోయింది. దాంతో ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. బల్కంపేటలో రైల్వే అండర్‌పాస్‌ కింద వరద నీటిలో కారు మునిగిపోయింది. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రైల్వే అండర్‌పాస్‌ కిందకు నీరు చేరడంతో దిల్‌షుఖ్‌నగర్‌ కోఠి మార్గంలో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, ఐకియా, విప్రో జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్‌ 45, బేగంపేట, పంజాగుట్ట సహా పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్‌, శిల్పారామం సైబర్‌ గేట్‌ వే రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
అప్రమత్తం చేసిన బల్దియా
జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ నగరంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, నేలకొరిగిన వక్షాలను తొలగించాలని జోనల్‌ కమిషనర్లను, డీసీలను ఆదేశించారు. డీఆర్‌ఎఫ్‌ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించొచ్చని తెలిపారు.
పిడుగు పాటుకు నలుగురు మృతి
కల్వకుర్తిలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. మరొకరు అపస్మారక స్థితిలోకెళ్లారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన పసునూరి ప్రవీణ్‌(30) అతని మామ నాగోజు జంగయ్యతో కలిసి గురువారం సాయంత్రం కడ్తాల్‌ నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో మార్గమధ్యలోని వాసుదేవ్‌పూర్‌ గేట్‌ బస్టాండ్‌ వద్ద నిలబడగా సమీపంలో పిడుగు పడింది. ఆ శబ్దానికి ప్రవీణ్‌ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే నిలుచున్న మాడ్గుల మండల కేంద్రానికి చెందిన జి.నిరంజన్‌కి కూడా గాయాలవ్వగా.. కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం రైతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ వైపు పంటలు దెబ్బతినగా.. మరోవైపు పిడుగులు పడి ఇద్దరు రైతులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన కంబల్ల శ్రీనివాస్‌, కొమరవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్‌ వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడటంతో కంబల్ల శ్రీనివాస్‌(32) అక్కడికక్కడే మృతిచెందాడు. స్వల్పంగా గాయపడిన నలుగురిని వేములవాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పాక్స్‌ చైర్మెన్‌ ఏనుగు తిరుపతి రెడ్డి పరామర్శించారు.తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌ గ్రామానికి చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య(50) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. వర్షంతోపాటు పిడుగు పడింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామంలో రైతు ఎనుగుల మల్లయ్యకు చెందిన ఆవు, దూడ పిడుగుపాటుతో మృత్యువాత పడ్డాయి.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి- ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 
హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Spread the love