– పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
– పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
– ప్రాణహిత పరివాహక ప్రాంతంలో పంటలకు నష్టం
– నిండుకున్న ప్రాజెక్టులు..దిగువకు నీటి విడుదల
– సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
– స్తంభించిన జనజీవనం..కొనసాగుతున్న వర్షం
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం బుధవారం రాత్రి వరకు కొనసాగింది. క్షణం తెరిపి లేకుండా కురుస్తుండటంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. మరోపక్క సాగునీటి ప్రాజెక్టులు నిండను తలపించగా.. ఎగువ నుంచి అధిక వరద రావడంతో కొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. మంచిర్యాల ప్రాంతంలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ(మట్టి తీయడం) ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోలెవల్ వంతెనలు దాటలేక రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా వర్షాల జోరు కొనసాగుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక చోట్ల పంటలకు మేలు జరుగుతుండగా..నదులు,వాగుల పరివాహక ప్రాంతాల్లో మాత్రం పంట పొలాల్లోకి వరద నీరు రావడంతో మొక్కలు వాడిపోయే ప్రమాదం పొంచి ఉంది. కొన్ని చోట్ల వరద తాకిడికి కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల నీటిలో మునిగిపోయాయి. మరోపక్క ఇన్నాండ్లు నీరు లేక బోసిపోయిన సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం మేరకు నిండుకోవడం..ఎగువ నుంచి వరద నీరు అధికంగా వస్తుండటంతో ముందుజాగ్రత్తగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి గేట్లును ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడం మూలంగా వంతెనల నిర్మాణం లేని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవల్ వంతెనలపై ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుండటంతో పలు చోట్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు,లోలెవల్ వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోగా..తాజాగా పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
నీట మునిగిన పంటలు..!
ఉమ్మడి జిల్లా సరిహద్దున ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఎగువ నుంచి వరదతో మరింత ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి ప్రహిస్తుండటం కారణంగా దహెగాం మండలంలోని దిగిడ, రాంపూర్, మొస్లగూడ, రావులపల్లి తదితర గ్రామాల్లోని పంటలన్ని నీట మునిగాయి. వీటితో పాటు బెజ్జూర్, వేమనపల్లి, కోటపల్లి, పెంచికల్‌పేట మండలాల్లోని నదీ సరిహద్దు గ్రామాల్లోని పంటలన్ని వరదపాలయ్యాయి. మరోపక్క కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కుమురంభీం(అడ) ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. భారీ వర్షాల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. పలు వాగుల వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన డీడీఆర్‌ఎఫ్ బృందాలను సైతం సిద్ధంగా ఉంచారు. మరోపక్క ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ మంది జనాలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోవడంతో వ్యాపారాలు నష్టపోవాల్సి వచ్చింది.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో రోజూ 12వేల మెట్రిక్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా.. ఇందారం ఓపెన్‌కాస్ట్‌లో నీళ్లు నిండుకోవడంతో బొగ్గుతో పాటు మట్టి తీయడం(ఓబీ) ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇది వరకు కురిసిన వర్షాలకు సైతం ఇక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.