రాజస్థాన్ కు భారీ వర్ష సూచన…

నవతెలంగాణ – రాజస్థాన్
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్‌ తుపాను గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర-కచ్ మీదుగా మధ్యాహ్నం సమయంలో క్రమంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్‌వైపు కదులుతున్న తుపాను.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ లోని బార్మర్, జాలోర్, జైసల్మేర్, జోధ్ పూర్, పాలి తదితర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తుపాను కారణంగా శుక్ర, శనివారాల్లో బార్మర్-జోధ్ పూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. జోధ్ పూర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు జైసల్మేర్ లోని డబ్లా గ్రామం నుంచి 100 కుటుంబాలకు చెందిన సుమారు 450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Spread the love